ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడడానికి ఇష్టపడరు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడో ఒకసారి అలా జరుగుతుందే తప్ప లేకపోతే అలా పోటీ అరుదుగా చూస్తుంటాం. కొన్నేళ్ల క్రితం సంక్రాంతికి నందమూరి హీరోలు జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో', బాలకృష్ణ నటించిన 'డిక్టేటర్' సినిమాలు సంక్రాంతికి పోటీ పడ్డాయి.

అలానే మెగాహీరోలు సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్ ల సినిమాలు 'ఇంటిలిజెంట్', 'తొలిప్రేమ' గతేడాది ఒకే సమయంలో రిలీజ్ అయ్యాయి. ఇలాంటి ఉదంతాలు చాలా తక్కువనే చెప్పాలి. తమిళంలో రాబోయే సంక్రాంతికి ఇలాంటి పరిస్థితే చోటుచేసుకోబోతుంది.

బోయపాటి ఆమెని వదిలేలా లేడు!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాకు పోటీగా ఆయన అల్లుడు ధనుష్ తన సినిమాని సంక్రాంతి రేసులో నిలబెడుతుండడం విశేషం. రజినీకాంత్ కొత్త సినిమా 'దర్బార్' సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అదే సీజన్ లో ధనుష్ సినిమా 'పటాస్'ని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాత ప్రకటించాడు.

కాకపోతే రెండు సినిమాల మధ్య ఒక వారం గ్యాప్ ఉంటుంది. 'పటాస్'ని జనవరి 16న రిలీజ్ చేయనున్నారు. వారం గ్యాప్ కూడా లేకుండా మామాఅల్లుళ్ల సినిమాలు రిలీజ్ కావడం ఆశ్చర్యమే.. నిజానికి రజినీకాంత్ సినిమా సంక్రాంతి రిలీజ్ అనే విషయం ఎప్పుడో అనౌన్స్ చేశారు.

ఈ మధ్య 'పటాస్' కూడా సంక్రాంతికి రిలీజ్ కానుందనే ప్రచారం జరిగింది కానీ రజినీకాంత్ కి పోటీగా ధనుష్ రాడని అనుకున్నారు. కానీ వారం గ్యాప్ కూడా తీసుకోకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి షాకిచ్చాడు ధనుష్. మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి!