నటుడు కమల్ హాసన్ పోస్టర్ పై పేడ వేశానని నటుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. వివరాలలోకి వెళ్తే.. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'దర్బార్' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం తాజాగా చెన్నైలో జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు రాఘవ లారెన్స్ రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు. రజినీకాంత్ పై కొందరు రాజకీయనాయకులు అవాక్కులు, చవాక్కులు పేలుతున్నారని, ఇకపై అలాంటి మాటలు మాట్లాడితే తాను బదులు చెబుతానని అన్నారు. తాను చిన్న వయసు నుండే రజినీకాంత్ కి వీరాభిమానిని అని చెప్పారు.

అలా చిన్నతనంలో నటుడు కమల్ హాసన్ అంటే ఇష్టపడేవాడిని కాదని, ఆయన పోస్టర్లపై పేడ వేశానని చెప్పారు. ఆ తరువాత రజినీకాంత్, కమల్ ల మధ్య ఎంత స్నేహముందో అర్ధమైందని అన్నారు. అయితే లారెన్స్ చేసిన వ్యాఖ్యలపై కమల్ హాసన్ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా లారెన్స్ పై విరుచుకుపడ్డారు.

రజినీకి మరచిపోలేని అవమానం.. అందుకే సూపర్ స్టార్ అయ్యారు!

దీంతో లారెన్స్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కలిగింది. తాను కమల్ హాసన్ పోస్టర్ పై పేడ వేశానన్న వరకే పరిగణలోకి తీసుకొని తనను అపార్ధం చేసుకుంటున్నారని, తన వ్యాఖ్యల వీడియోను పూర్తిగా చూస్తే తన భావన ఏంటో అర్ధమవుతుందని చెప్పారు.

తాను చిన్న వయసులో రజినీకాంత్ వీరాభిమానినని చెప్పాలని, అలా తెలిసీ తెలియని వయసులో కమల్ హాసన్ పోస్టర్ లపై పేడ వేశానని చెప్పారు. తన మాటలు ఎవరినైనా  బాధించి ఉంటే క్షమించమని కోరారు. తానైతే తప్పుగా మాట్లాడలేదని అన్నారు. కమల్ హాసన్ పై తనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు.