'ఎన్నేళ్లయినా.. నాలో ఆవేశం తగ్గదు.. ఆశయం మారదు.. ఒకసారి నేను నల్లకోటు వేసుకున్నానంటే.. వేసుకోవడానికి పిటీషన్లు, తీసుకోవడానికి బెయిళ్లు ఉండవు' అంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన ప్రధాన పాత్రలో 'పింక్' సినిమా రీమేక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

హిందీలో ఘన విజయం సాధించిన ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తుండడంపై పలు రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే సినిమా షూటింగ్ మొదలైంది. అయితే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీకైంది.

హరీష్, పవన్ చిత్రం: డైలాగుల్లో అంతర్లీనంగా ఆ కంటెంట్!

అందులో పవన్ కళ్యాణ్ ఓ వ్యక్తితో ఫైట్ చేస్తూ.. 'నేను నల్లకోటు వేసుకున్నానంటే.. వేసుకోవడానికి పిటీషన్లు, తీసుకోవడానికి బెయిళ్లు ఉండవు' అంటూ ఆవేశంగా డైలాగ్స్ చెబుతున్నారు. షూటింగ్ స్పాట్ లో ఉన్న వ్యక్తులే రహస్యంగా ఈ వీడియో రికార్డ్ చేసి లీక్ చేసినట్లు తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని నడుచుకుంటూ వెళ్తోన్న ఫోటోలను కూడా లీక్ చేశారు.

దీంతో షూటింగ్ స్పాట్ లో సెక్యురిటీని కాస్త పెంచారు. అయినప్పటికీ లీకులు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు ఏకంగా సినిమాలో ఓ డైలాగ్ వీడియోనే లీక్ చేసేసారు. మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

'ఎంసీఏ' ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు పవన్.. దర్శకుడు క్రిష్ అలానే హరీష్ శంకర్ లతో కలిసి పని చేయడానికి అంగీకరించాడు.