తమిళనాట ప్రముఖ సింగర్ గా గుర్తింపు ఉన్న ధరణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ధరణి.. ప్రముఖ సినీ గాయకుడు పజని కుమారుడు. కోలీవుడ్ లో ఎన్నో వందల పాటలు పాడిన పజని వారసుడిగా ధరణి సింగర్ గా పరిచయమయ్యారు. పలు హిట్ పాటలను పాడిన ధరణికి కోలీవుడ్ లో మంచి పేరుంది.

అయితే ధరణికి అక్రమ సంబంధం ఉన్న కారణంగా ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్న భార్యని వేధించాడట. వివరాల్లోకి వెళితే.. 34 ఏళ్ల ధరణి తన స్నేహితురాలైన విజయ భానుని మూడేళ్లు ప్రేమించి.. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు.

నిఖిల్ 'అర్జున్‌ సురవరం' ఫిల్మ్ నగర్ టాక్!

పెళ్లి సమయంలో విజయ కుటుంబ సభ్యులు భారీ మొత్తంలో కట్న,కానుకలు సమర్పించారు. పెళ్లి అయినంత వరకు విజయపై విపరీతమైన ప్రేమ కురిపించిన ధరణి పెళ్లి తరువాత మారిపోయాడు. కొంతకాలంగా ధరణి తనకంటే పదేళ్లు పెద్దదైన నిత్యా అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 

ఆ విషయం విజయకి తెలియడం తన భర్తని నిలదీసింది. దాంతో ధరణికి కోపం వచ్చి విజయని విచక్షణారహితంగా కొట్టాడని, శారీరకంగా చిత్రహింసలు పెట్టాడంటూ విజయ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నిత్యా అనే మహిళకు గతంలోనే రెండు పెళ్లిళ్ళు జరిగాయి. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ధరణితో సంబంధం పెట్టుకొని మరో బిడ్డకి జన్మనిచ్చినట్లుగా విచారణలో తేలింది. ధరణి భార్యని శారీరకంగా వేధించడంతో పాటు అదనపు కట్నం కోసం చిత్రహింసలు పెట్టినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ధరణికి సహాయం చేశారనే ఆరోపణలతో ఆయన కుటుంబసభ్యులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించిన విచారణ జరుగుతోంది.