PM Modi biopic: 'విశ్వనేత'.. త్వరలో పట్టాలెక్కనున్న ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్..
PM Narendra Modi biopic Vishwa Netha: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. వరుసగా రెండు సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన నేత. భారత రాజకీయాల్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ప్రధాని జీవిత చరిత్రపై ఓ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ?
PM Modi biopic: ప్రధాని నరేంద్ర మోడీ.. ఓ సామాన్య కార్యకర్త నుండి భారతదేశానికి ప్రధాన మంత్రిగా ఎదిగిన నేత. ఇప్పటికే రెండుసార్లు భారతదేశ ప్రజల హృదయాలను కొల్లగొట్టి తన పార్టీని అధికారంలోకి తీసుకవచ్చిన నేత. ఇక ముచ్చటగా మూడో సారి కూడా తన పార్టీని అధికారంలోకి తీసుకరావాలని ప్రయత్నిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ . ఇప్పటికే పలు సర్వేలు ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి భారతదేశ పాలనా పగ్గాలు చేపట్టబోతున్నారని చెప్పుతున్నాయి.
ఇదే నేపథ్యంలో నరేంద్ర మోదీ (Narendra Modi) బయోపిక్ తెరకెక్కనుంది. 'విశ్వనేత" పేరుతో అన్ని భారతీయ భారతీయ భాషల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం కానున్న ఈ చిత్రానికి యువ ప్రతిభావంతులైన సిహెచ్ క్రాంతి కుమార్ దర్శకత్వం వహించనున్నారు. అభయ్ డియోల్, నీనా గుప్తా, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని 'వందే మీడియా ప్రైవేట్ లిమిటెడ్' బ్యానర్‌పై కాశిరెడ్డి శరత్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి తనయుడు, జాతీయ అవార్డు గ్రహీత కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ఆర్టికల్ 370 రద్దు, నోట్ల రద్దు, జీఎస్టీ, అయోధ్య రామమందిర నిర్మాణం, మెజారిటీ ప్రజల మెడపై కత్తిలా వేలాడుతున్న "యూనిఫాం సివిల్ కోడ్", వన్ నేషన్ వన్ ఎలక్షన్, అనేక దుర్మార్గపు చట్టాలను రద్దు వంటి ఎన్నో సాహసోపేతమైన, సంచలనాత్మక నిర్ణయాలను ఈ చిత్రంలో ప్రస్తవించనున్నారు. ప్రత్యేకంగా నరేంద్ర మోడీ బయోపిక్‌లో ఆయన చాయ్ వాలా స్థాయి నుండి "ప్రపంచ నాయకుడు"గా ఎదగడానికి దృశ్య రూపం ఇస్తామని చిత్ర యూనిట్ చెబుతోంది.
గతంలో నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ‘పీఎం నరేంద్ర మోదీ’ బయోపిక్ రూపొందింది. 2019 ఎన్నికల సందర్భంగా ఈ సినిమా విడుదలైంది. ఇందులో వివేక్ ఒబెరాయ్ ప్రధాని నరేంద్ర మోడీ పాత్రను పోషించారు. నరేంద్ర మోడీ జీవితంపై వెబ్ సిరీస్ కూడా రూపొందిన సంగతి తెలిసిందే.