పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత తిరిగి సినిమాల్లో నటించరని అనుకున్నారు. కానీ ఆయన 'పింక్' రీమేక్ తో ఫ్యాన్స్ ని ఖుషీ చేయడానికి వచ్చేస్తున్నారు.  అంతేకాదు ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ముందు 'పింక్' రీమేక్ పూర్తి చేసి ఆ తరువాత దర్శకుడు క్రిష్, హరీష్ శంకర్ సినిమాలు చేయబోతున్నాడు. అయితే  ఇప్పుడు 'పింక్' రీమేక్ విడుదలపై స్పష్టత వచ్చింది. ఈ సినిమాని వేసవి కానుకగా విడుదల చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.

'ఎన్నేళ్లయినా.. నాలో ఆవేశం తగ్గదు..' పవన్ షూటింగ్ వీడియో లీక్!

టైటిల్ పై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఎవరేమనుకున్నా పరవాలేదని.. అయితే సినిమాని మాత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఎందుకంటే మే 11న 'గబ్బర్ సింగ్' సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుందని అన్నారు.

ఉగాది సందర్భంగా టైటిల్ ని విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దిల్ రాజు 'జాను' సినిమా ప్రచారంలో ఉన్నారు. ఆ తరువాత 'వి' ప్రమోషన్స్ ప్రారంభమవుతాయి.

ఆ తరువాత పవన్ సినిమాపై పూర్తి దృష్టి పెడతామని అన్నారు. 'పింక్' రీమేక్ కి సంబంధించి చాలా మార్పులు చేశామని.. హిందీ, తమిళ భాషల్లో విడుదలైన సినిమాలా ఉండదని.. ఓ కొత్త సినిమాని చూస్తారని అన్నారు.