పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఆ మధ్య సినిమాలు చేయనని తన ఫోకస్ మొత్తం రాజకీయాల మీదే ఉందని ప్రకటనలు చేసిన పవన్ అంతకు ముందు అడ్వాన్స్ లు తీసుకున్న నిర్మాతల ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. రీఎంట్రీ సినిమాని పింక్ రీమేక్ గా ఇప్పటికే దిల్ రాజు నిర్మాణంలో ప్రారంభించి, షూటింగ్ కు హాజరు అవుతున్నారు. అయితే ఆయన ఒక్క సినిమాతో ఆపదలచుకోలేదు. తన తదుపరి చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలోనూ ఈ రోజు(జనవరి 29) నుంచి ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్ అల్యూమినియం ప్యాక్టరీలో షూట్ ప్రారంభం కానుంది.

ప్రముఖ నిర్మాత ఎఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ఇదొక పీరియడ్ డ్రామా. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించే ఈ చిత్రం..జనపదాల్లో ఉన్న ఓ నాయకుడు కథ. పవన్ కెరీర్ లో ఇది 27 వ చిత్రం. ఈ సినిమాలో పవన్ పాత్ర చాలా ఉదాత్తంగా ఉంటుందని చెప్తున్నారు. అందుకే వెంటనే పవన్ ఈ సినిమాని పెద్ద మార్పులు , చేర్పులు లేకుండా ఒప్పుకున్నాడంటున్నారు.

బాలయ్య వద్దు...పవన్ ముద్దు అంటోంది

ఖచ్చితంగా ఇది తన పొలిటికల్ కెరీర్ కు ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. వరసగా రెండు డిజాస్టర్స్ ఇచ్చిన క్రిష్..ఎలాగైనా ఈ సినిమాతో మళ్లీ లైమ్ లైట్ లోకి రావాలని భావిస్తున్నారు. ఇప్పటివరకూ పవన్ ఈ జోనర్ సినిమా చేయలేదు. కాబట్టి ఇది చాలా కొత్త ప్రయత్నమనే అంటున్నారు.  
 
మరో ప్రక్క వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తున్న `పింక్` రీమేక్‌ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ క్రిష్ రూపొందించబోయే సినిమా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా ఈ ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించేసారు.

దర్శకుడు క్రిష్, రచయిత బుర్రా సాయిమాధవ్ గత కొద్ది కాలంగా ఈ సినిమా స్క్రిప్టు సిద్ధం చేసారట. ఈ సినిమా గురించి కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ.. ఈ సినిమా ఉంటుందా? ఉండదా? అనే సందేహాలు నెలకొన్నాయి. అవి ఈ రోజు షూట్ ప్రారంభంతో ఆగినట్లే. అయితే రెగ్యులర్ షూట్ `పింక్` రీమేక్ పూర్తయిన వెంటనే ఈ సినిమా మొదలవుతుందని సమాచారం. `పింక్` రీమేక్ కోసం పవన్ 45 రోజుల పాటు కాల్షీట్లు ఇచ్చారట.