త్వరలోనే తన పెళ్లి ప్రకటన చేస్తానని చెబుతున్నాడు హీరో నిఖిల్. చాలా రోజులుగా నిఖిల్ పెళ్లి టాపిక్ వార్తల్లో వస్తూనే ఉంది. కానీ ఈ హీరో ఇప్పటివరకు పెళ్లి విషయంపై మాత్రం మాట్లాడలేదు. తను నటించిన 'అర్జున్ సురవరం' సినిమా థియేటర్లోకి వచ్చిన తరువాత తన పెళ్లిపై ఓ ప్రకటన చేస్తానని చెబుతున్నాడు నిఖిల్.

 

తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు నిఖిల్. ఈ క్రమంలో అభిమానులు అడిగిన కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు జవాబులు చెబుతున్నాడు. దర్శకుడు వీఐ ఆనంద్ తో మరోసారి కలిసి పని చేయబోతున్నట్లు చెప్పాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' అనే సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఆ హీరోలిద్దరిపై సాయిధరమ్ తేజ్ సెటైర్లు.. ఊహాగానాలకు మారుతి క్లారిటీ!

ప్రస్తుతం వీఐ ఆనంద్ 'డిస్కో రాజా' సినిమా సెట్ లో ఉన్నాడని.. త్వరలోనే ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని చెప్పాడు. తనకు మల్టీస్టారర్ సినిమాలో నటించడం ఇష్టమని కానీ సరైన కథ దొరకడం లేదని అంటున్నాడు నిఖిల్. మల్టీస్టారర్ కథతో రీసెంట్ గా రానాతో ఓ సినిమా చేయాల్సింది కానీ మిస్ అయినట్లు చెప్పాడు నిఖిల్.

మరోసారి ఆ ఛాన్స్ వస్తే మాత్రం మిస్ చేసుకోనని చెబుతున్నాడు. మంచి స్క్రిప్ట్ లు వెతికి పట్టుకోవడం రానా స్పెషలిస్ట్ అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ వస్తే వదులుకోనని చెబుతున్నాడు నిఖిల్. 

అవసరమైతే తన సినిమాను క్యాన్సిల్ చేసుకొని మరీ పవన్ తో కలిసి నటిస్తానని, తన సినిమా నిర్మాత నష్టాల్ని కూడా తనే భరిస్తానని.. పవన్ తో సినిమా ఛాన్స్ మాత్రం వదులుకోనని చెబుతున్నాడు. నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం' సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని దర్శకుడు టి.సంతోష్ తెరకెక్కించాడు.