చిత్రలహరి లాంటి డీసెంట్ హిట్ తర్వాత సాయిధరమ్ తేజ్ నుంచి రాబోతున్న చిత్రం ప్రతిరొజూ పండగే. ప్రతిరోజూ పండగే చిత్రం సందేశంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతోంది. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ముగిసింది. 

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రచార కార్యక్రమాలని కూడా చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. ఇటీవల విడుదల చేసిన ఓ బావ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. 

ఈ కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ మారుతి చిత్రాలపై, హీరో నాని, శర్వానంద్ లపై ఫన్నీ సెటైర్లు వేశాడు. మారుతి చిత్రాల్లో హీరోకి ఏదో ఒక సమస్య ఉంటుంది. భలే భలే మగాడివోయ్ చిత్రాల్లో నానికి మతిమరపు, మహానుభావుడు మూవీలో శర్వానంద్ కు అతి పరిశుభ్రతని చూశాం. ఈ చిత్రంలో తనకు ఎలాంటి డిసీజ్ లేదని అంటున్నాడు తేజు. 

ప్రతిరోజూ పండగే చక్కటి కుటుంబ కథా చిత్రం. సినిమా చూశాక మీరే ఈ విషయాన్ని చెబుతారు. మనల్ని మనం ప్రశ్నించుకునే విధంగా ఈ మూవీలో చక్కటి సందేశం ఉంటుందని తేజు తెలిపాడు. 

దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనగానే వివిధ చిత్రాలతో పోలికలు పెడుతుంటారు. కానీ ప్రతి రోజూ పండగే మూవీకి మరే చిత్రంతోనూ సంబంధం లేదు. ఇలాంటి కథాంశంతో చిత్రం తెరకెక్కడం ఇండియన్ స్క్రీన్ పై ఇదే తొలిసారి. ఒక బిడ్డ జన్మించినప్పుడు ఫ్యామిలీ మొత్తం సెలెబ్రేట్ చేసుకుంటుంది. అలాగే మరణించే సమయంలో కూడా అతడికి సంతోషంగా సెండాఫ్ ఇవ్వడం ముఖ్యం. ఈ పాయింట్ తోనే ప్రతిరోజూ పండగే మూవీ ఉండబోతోందని మారుతి అన్నారు. 

గీతాఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. రావు రమేష్, సత్యరాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు.. తేజు రాశి ఖన్నా రొమాన్స్ కూడా ఈ మూవీలో ప్రధాన ఆకర్షణ కాబోతోంది.