సినిమా కలెక్షన్స్ పెంచుకునేందుకు దర్శక,నిర్మాతలు రకరకాల మార్గాలు అన్వేషిస్తూంటారు. రిపీట్ ఆడియన్స్ వస్తేనే లాభాలు బాగా కనపడతాయి. అందుకోసం ఎడిటింగ్ లో ప్రక్కన పెట్టిన సీన్స్ కలపటమో లేక పాట కలపటమో చేస్తూంటారు. సినిమా రన్ స్లో అయ్యినప్పుడు ఈ స్క్రీమ్స్ వేస్తూంటారు. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ కూడా అదే మార్గం ఎంచుకుంది. ప్రేక్షకులకు మరిన్ని నవ్వులు పంచేందుకు, అదనంగా మరో కామెడీ సీన్ ను యాడ్ చేయబోతోంది యూనిట్. ఈ విషయాన్ని దర్శకుడు అనీల్ రావిపూడి ఖరారు చేసి చెప్పారు.

అనీల్ రావిపూడి మాట్లాడుతూ... ‘‘సంక్రాంతికి బాక్సాఫీస్‌ దద్దరిల్లిపోయింది. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని మహేష్‌గారి కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంకా మూడు వారాల రన్‌ ఉంది. సినిమాలో కొత్తగా 90సెకన్లు ఉండే ఓ సీన్‌ను జోడించబోతున్నాం. దాంతో ఇంకొంచెం నవ్వులు బోనస్‌గా లభిస్తాయి. సినిమాను మళ్లీ చూడాలనుకునేవారికి, కొత్తగా చూడాలనుకునేవారి కోసం ఈ సీన్‌ను యాడ్‌ చేస్తున్నాం. ఎప్పుడు యాడ్‌ చేస్తామనేది త్వరలో చెబుతాం’’ అన్నారు. రావు రమేష్ కుటుంబానికి, మహేష్ కు మధ్య వచ్చే ఈ ఫన్ సీన్ అందరికీ నచ్చుతుందంటున్నాడు.

ట్రేడ్ టాక్: 'సరిలేరు నీకెవ్వరు' లేటెస్ట్ US కలెక్షన్స్

అంతేకాకుండా ...ఈ సినిమాకు సంభందించిన ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేలా.. మరో పెద్ద ఈవెంట్ నిర్వహించబోతున్న విషయాన్ని బయటపెట్టాడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న మహేష్ తిరిగొచ్చిన వెంటనే..  మరో భారీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.

మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైన సంగతి తెలిసిందే. తమ సినిమాకు మంచి స్పందన, కలెక్షన్స్‌ వస్తున్నాయని చిత్రం టీమ్ చెబుతోంది.