బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో నానాటికి రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇప్పటికే బీహార్, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోల్డ్ వార్ నడుస్తుండటంతో పాటు నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు.

తాజాగా ఈ వ్యవహారంలో మరాఠా రాజకీయ యోధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వచ్చి చేరారు. సుశాంత్ కేసు పెద్ద విషయమేమీ కాదని, ముంబై పోలీసులపై తనకు పూర్తి నమ్మకం వుందని ఆయన స్పష్టం చేశారు.

Also Read:సుశాంత్‌, స్నేహితుడు సిద్దార్థ్ మధ్య రహస్య ఒప్పందాలేంటి?

తాను 50 ఏళ్లుగా ముంబై, మహారాష్ట్ర పోలీసులను చూస్తున్నానని పవార్ అన్నారు. ముంబై పోలీసులపై వస్తున్న ఆరోపణలపై మాత్రం స్పందించనని శరద్ వ్యాఖ్యానించారు. సీబీఐ లేదా ఇతర ఏజెన్సీతో దర్యాప్తు చేయాలని ఎవరైనా అనుకుంటే తాను వ్యతిరేకించనని శరద్ పవార్ స్పష్టం చేశారు.

ఇదే సమయంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్  పవార్ కుమారుడు పార్థ పవార్ చేసిన  వ్యాఖ్యలు పరిపక్వం లేనివని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదని పవార్ స్పష్టం చేశారు.

సుశాంత్ కేసు విషయంలో రాష్ట్ర పోలీసులకే  మొదటి అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చాలా రోజుల నుంచి సుశాంత్ ముంబై వాసి అని, ముంబై ఆయనకు శ్రేయస్సు ఇచ్చిందని, బీహార్ మాత్రం సుశాంత్‌కు అండగా నిలబడలేదని శరద్ పవార్ విమర్శించారు.

సుశాంత్ కేసుపై ఆయన తండ్రి కేకే సింగ్ బీహార్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీహార్  ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈకేసును  కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే.