బాలీవుడ్ హీరో నవాజుద్దీన్ సిద్ధిఖీ సోదరి స్యామా తామ్షీ సిద్ధిఖీ (26) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె శనివారం నాడు మరణించినట్లు సిద్ధిఖీ కుటుంబసభ్యులు తెలిపారు.

పద్దెనిమిది ఏళ్ల వయసులోనే స్యామా రొమ్ము క్యాన్సర్ బారిన పడిన విషయాన్ని నవాజుద్ధీన్ గతేడాది సోషల్ మీడియా ద్వారా అభిమానులకి వెల్లడించాడు. స్యామా 25వ పుట్టినరోజు సందర్భంగా.. చిన్న వయసు నుండే తన సోదరి చావుతో ధైర్యంగా పోరాడుతోందని చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా దాదాపు ఏడేళ్లుగా స్యామాకి ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆమె మరణంతో నవాజుద్ధీన్ తో పాటు అతడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.స్యామా అంత్యక్రియలు సిద్ధిఖీ కుటుంబ స్వగ్రామమైన బుధానా (ఉత్తరప్రదేశ్)లో ఆదివారం నాడు నిర్వహించినట్లు సమాచారం.

తెలుగు తెరపై కొత్త రుచులు.. ఏడాది రచ్చ చేసిన హీరోయిన్లు వీరే!

కాగా నవాజుద్ధీన్ ఇటీవల 'మోతీచూర్ చక్నాచూర్' అనే సినిమాలో హీరోగా నటించారు. అలానే 'సేక్రెడ్ గేమ్స్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ మూడో సీజన్ కి సిద్ధమవుతోంది.

ప్రస్తుతం నవాజుద్ధీన్ బంగ్లాదేశీ ఫిల్మ్‌మేకర్‌ సర్వార్‌ ఫరూఖీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నో ల్యాండ్స్‌ మ్యాన్‌' అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా అమెరికాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో చెల్లెలి మరణవార్త విని ఇండియాకి వచ్చినట్లు సమాచారం.