అక్కినేని నాగేశ్వర రావు జాతీయ అవార్డుల ప్రదానోత్సవం శనివారం సాయంత్రం రోటీన్ కు భిన్నంగా జరిగింది. సరదా సరదాగా సాగింది. 2018కిగాను శ్రీదేవికి, 2019కి గాను బాలీవుడ్ నటి రేఖకు అక్కినేని నాగేశ్వర రావు అవార్డుల ప్రదానం జరిగింది. రేఖను నాగార్జున కొన్ని వేశారు. 

ఇప్పటికీ ఇంత అందంగా ఎలా ఉన్నారని ఆయన రేఖను ప్రశ్నించారు. దానికి రేఖ సమాధానమిస్తూ మీరు ఇంత అందంగా లేరా అని ఎదురు ప్రశ్న వేశారు. దానికి సభలో నవ్వులు పూశాయి. సమాంతర సినిమాతో పాటు కమర్షియల్ సినిమాలోనూ మీరు రాణించారు, ఇదేలా సాధ్యమని నాగార్జున రేఖను అడిగారు. సినిమా ఈజ్ సినిమా, లైఫ్ ఈజ్ లైఫ్ అంతే రేఖ జవాబిచ్చారు. 

'నువ్వు తెలుగు అమ్మాయివి'.. నా తల్లి చివరి కోరిక అదే: నటి రేఖ!

తెలుగులో రేఖ నటించిన మొదటి సినిమా ప్రస్తావన కూడా వచ్చింది. రంగుల రాట్నం రేఖ నటించిన తొలి తెలుగు సినిమా అని నాగార్జున చెప్పారు. అది వాస్తవం కాదని రేఖ చెప్పారు. తాను నటించిన మొదటి తెలుగు చిత్రం ఇంటిగుట్టు అని చెప్పారు. ఆ సినిమా వివరాలు తాను చెప్పబోనని, సినిమా చూసి తెలుసుకోవాలని రేఖ చమత్కరించారు. 

మరో ఆసక్తికరమైన సంఘటన కూడా జరిగింది. తెలుగు సినిమాలో నటించాలని తనకు గ్రాండ్ మదర్ గా నటించాలని నాగార్డున అన్నారు. దానికి వెంటనే మెగాస్టార్ చిరంజీవి మైక్ తీసుకుని స్పందించారు. తాను దాన్ని అంగీకరించబోనని, నాగార్జున డబుల్ రోల్ వేసే సినిమాలో రేఖ నటిస్తారని, నాగార్జున తండ్రీకొడుకుల వేషాలు వేయాలని, అందులో నాగార్జునకు వైఫ్ గా రేఖ నటించాలని చిరంజీవి అన్నారు. 

శ్రీదేవి అవార్డును అందుకున్న ఆమె భర్త బోనీ కపూర్ తాను మాట్లాడే సమయంలో కంటతడి పెట్టుకున్నారు. గద్గద స్వరంతో ఆయన కొద్దిగా మాత్రమే మాట్లాడి విరమించుకున్నారు రేఖ చక్కగా తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు.