భారత చలన చిత్ర రంగంలో దిగ్గజ నటీమణులలో రేఖ ఒకరు. వందలాది చిత్రాల్లో ఆమె నటించారు. గ్లామర్ రోల్స్ తో అదరగొట్టినా.. నటనకు ప్రాధ్యానత ఉన్న పాత్రల్లో నటించి పలు అవార్డులు సొంతం చేసుకున్నా ఆమెకే చెల్లింది. కింగ్ నాగార్జున తన తండ్రి ఏఎన్నార్ పేరిట ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ కు రేఖ ఎంపికయ్యారు. 

ఆదివారం రోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన కార్యక్రమంలో రేఖకు అవార్డు అందించారు. ఈ కార్యక్రమంలో రేఖ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బాలీవుడ్ లో తిరుగులేని నటిగా ఎదిగిన రేఖ ప్రసంగానికి అంతా ఫిదా అయ్యారు. స్పష్టమైన తెలుగులో ఆమె మాట్లాడడంతో అంతా ఆశ్చర్యపోయారు. 

ఆమె తెలుగు మాట్లాడడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రేఖ తెలుగు మూలాలు ఉన్న నటి. రేఖ తండ్రి జెమినీగణేశన్ తమిళ నటుడు కాగా ఆమె తల్లి పుష్పవల్లి పుట్టి పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో. 

ఈ సందర్భంగా తన తల్లి చివరి కోరికని, తెలుగు చిత్ర పరిశ్రమతో తనకు ఉన్న అనుబంధాన్ని రేఖ బయట పెట్టారు. తన సినీ ప్రస్థానమే మొదలైంది తెలుగు సినిమాతో అని రేఖ తెలిపారు. తాను నటించిన మొట్టమొదటి చిత్రం 'ఇంటి గుట్టు' అని రేఖ తెలిపారు. ఆ చిత్రంలో తాను ఏడాది చిన్న పాపని అని రేఖ తెలిపింది. ఆ తర్వాత మరికొన్ని తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. 

మెగాస్టార్ చిరంజీవి తన తల్లి గర్భంలో ఉండగా.. ఇంత పిచ్చి అభిమానమా..!

తన తల్లి చివరి కోరిక తాను తెలుగు సినిమాలో నటించాలి అని రేఖ తెలిపింది. తన తల్లి ఆసుపత్రిలో ఉండగా.. నువ్వు తెలుగు అమ్మాయివి అమ్మా.. నా కోసం ఒక్క తెలుగు సినిమా చేయమ్మా అని మా అమ్మ అడిగింది. మీరంతా ఒప్పుకుంటే నేను త్వరలోనే తెలుగు సినిమాలో నటిస్తా అని రేఖ అన్నారు. దీనితో సభలో ఉన్న ప్రతి ఒక్కరూ చప్పట్లతో తమ సంతోషాన్ని తెలియజేశారు. 

ఏఎన్నార్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. తాను దాదాపు పదేళ్లు హైదరాబాద్ లో, అన్నపూర్ణ స్టూడియోస్ లో గడిపానని అన్నారు. ఆ సమయంలో ఏఎన్నార్ గారు నన్ను బాగా గమనించేవారు. ఆయన తనని ఏం అమ్మాయ్ అని పిలిచేవారని రేఖ అన్నారు.