గతేడాది నడిగర్ సంఘం ఎన్నికలు ఎంత వివాదాస్పదమయ్యాయో తెలిసిందే. ఈ ఎన్నికల కౌంటింగ్ పై తీర్పు వస్తుందని ఆశిస్తుంటే.. ఏకంగా ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునివ్వడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నడిగర్ సంఘానికి మళ్లీ ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే.. 2019 జూలై 23వ తేదీన చెన్నైలో నడిగర్ సంఘానికి ఎన్నికలు జరిగాయి. నాజర్‌, విశాల్‌ సారథ్యంలోని పాండవర్‌ జట్టు పోటీ చేయగా.. కె.భాగ్యరాజా, ఐసరి కె.గణేష్‌ సారథ్యంలోని శంకరదాస్‌ జట్టు పోటీ చేసింది. అయితే ఈ ఎన్నికలపై కొందరు సభ్యులు కోర్టులో పిటిషన్ వేయడంతో ఓట్ల లెక్కింపుని నిలిపివేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

వయ్యారాలు ఒలకబోస్తున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు వైరల్!

గత ఏడు నెలలుగా ఓట్లు బ్యాలెట్ బాక్సుల్లోనే ఉన్నాయి. దీంతో నడిగర్ సంఘం కార్యకలాపాలు నిలిచిపోవడంతో రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాల్ బృందం కోర్టుని ఆశ్రయించింది. అదే సమయంలో ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని.. ఆ ఎన్నికలు చెల్లవని ప్రకటించాలని కోరుతూ ఇద్దరు సభ్యులు కోర్టులో పిటిషన్ వేశారు.

దీంతో విశాల్ బృందం కూడా కోర్టులో అప్పెల్ చేసింది. ఈ పిటిషన్లను పరిశీలించిన కోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో శుక్రవారం మరొకసారి ఈ వ్యవహారం విచారణకు రాగా.. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి కల్యాణసుందరం తీర్పు వెలువరించారు.  

గతేడాది జూన్‌ 23న జరిగిన నడిగర్‌ సంఘం ఎన్నికలు రద్దు చేస్తున్నామని, ఆ ఎన్నికలు చెల్లవని ప్రకటిస్తూ.. మరో మూడు నెలల్లో మళ్లీ ఎన్నికలు జరపాలని ఆదేశించారు. కొత్త కార్యవర్గం ఎన్నికయ్యే వరకు ప్రత్యేక అధికారి పర్యవేక్షణలోనే నడిగర్‌ సంఘం ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకెళ్లాలని విశాల్ బృందం భావిస్తోంది.