తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర సంగీత దర్శకుడిగా దూసుకుపోతున్నాడు తమన్. ఒకప్పుడు తమన్ అంటే ఫాస్ట్ బీట్ సాంగ్స్ గుర్తొచ్చేవి. కానీ ఈ మధ్యకాలంలో అన్ని రకాల పాటలను కంపోజ్ చేస్తూ మెప్పిస్తున్నాడు. ఇటీవల తమన్ సంగీతం అందించిన 'అల.. వైకుంఠపురములో' పాటలు సెన్సేషన్ అయ్యాయి.

తాజాగా మీడియా ముందుకొచ్చిన తమన్ కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. ఇప్పటికే పలు చిత్రాల్లో పాత పాటలను రీమిక్స్ చేసిన తమన్ ఇకపై అలాంటి పనులు చేయనని అంటున్నాడు.

ఆ విషయంలో సన్నీకి సాటిలేరెవరు!

ఇకపై రీమిక్స్ సాంగ్స్ చేయాలనుకోవడం లేదని.. ఆ పాటలు చేయడానికి చాలా టెన్షన్ పడాలని, ఒరిజినల్ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ రచయిత, గాయకులు అందరూ ఈ రీమిక్స్ పాటలను తిట్టుకుంటారని.. అంత టెన్షన్ అవసరం లేదనిపిస్తోందని వెల్లడించాడు. ఇలా రీమిక్స్ సాంగ్స్ చేసినప్పుడల్లా బాలు గారు ఫోన్ చేసి తిడుతుంటారని చెప్పారు.

ఏదైనా పాట రీమిక్స్ చేస్తే.. వెంటనే బాలు గారు ఫోన్ చేసి.. 'ఇవన్నీ నీకెందుకురా..? అవసరమా..?' అని తిడుతుంటారని అందుకే ఇకపై రీమిక్స్ సాంగ్స్ చేయనని.. ఆ విషయం డైరెక్టర్లకు ముందుగానే చెప్పేస్తున్నానని తమన్ తెలిపారు.

విమర్శలను ఎలా తీసుకుంటారని తమన్ ని ప్రశ్నించగా.. పొగిడేవాళ్లతో పాటు తిట్టేవాళ్లు కూడా ఉండాలని.. ఎవరూ ఊరికే తిట్టరని.. వాళ్లని మెప్పించడానికి ప్రయత్నిస్తూ ఉండాలని చెప్పారు. ప్రస్తుతం తమన్ 'అల.. వైకుంఠపురములో' సినిమాతో పాటు 'వెంకీ మామ', 'ప్రతిరోజు పండగే' వంటి చిత్రాలకు మ్యూజిక్ అందిస్తున్నారు.