టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు తమన్. దేవిశ్రీప్రసాద్ లాంటి అగ్ర సంగీత దర్శకులను పక్కకునెట్టి ముందంజలో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో తమన్ హిట్ల మీద హిట్లు కొడుతూనే ఉన్నాడు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అల.. వైకుంఠపురములో' సినిమాకి కూడా తమన్ సంగీతం అందించారు.

ఈ సినిమా మ్యూజికల్ గా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా సక్సెస్ మీట్ ని ఇటీవల వైజాగ్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో తమన్ మాటలు వివాదానికి దారితీశాయి. నిజాలే మాట్లాడుకుందాం, నిజమైన కలెక్షన్లే చెప్పుకుందామనే మాటలు తమన్ నోటి వెంట వచ్చాయి.

నిజమైన కలెక్షన్స్ మాత్రమే చెబుతాం.. గెలిచాం, కొట్టాం.. తమన్ కామెంట్స్!

దాంతో ట్విట్టర్ లో హడావిడి మొదలైంది. చాలా మంది 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ కి ఇది సరైన సమాధానమంటూ తమన్ వీడియో క్లిప్ షేర్ చేస్తున్నారు. మరికొందరు ఈ విషయంలో తమన్ ని ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన తమన్.. తను కావాలని అన్న మాటలు కావని, ఎవరినీ టార్గెట్ చేసి అలా మాట్లాడలేదని.. క్యాజువల్ గా అన్నీ నిజాలే మాట్లాడుకుందామని ఫ్లోలో అనేశానని చెప్పారు.

అప్పటికి తనకు సినిమాలు, వాటి కలెక్షన్ వివాదాలేవీ తెలియవని.. ట్విట్టర్ లో ఎవరో తన స్పీచ్ ని షేర్ చేస్తూ కామెంట్స్ చేయడంతో అప్పుడు విషయం తెలిసిందని అన్నారు. తనకు అందరూ స్నేహితులేనని.. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు పని చేశానని గుర్తు చేసుకున్నారు.

త్వరలోనే మళ్లీ  మహేష్ సినిమాకి పని చేయబోతున్నానని చెప్పారు. అందువల్ల తను ఎవరినో ఉద్దేశించి అన్నానని, ఎవరికోసమో అన్నానని అనుకోవద్దని.. అలా అనిపించి ఉంటే తను కావాలని చేయలేదనే విషయాన్ని గ్రహించాలని చెప్పుకొచ్చారు.