హైదరాబాద్: ఒక్క మూగ పిల్ల కోసం ఇద్దరు మిత్రులు పోటీ పడడం అనేది ప్రస్తుతం మౌనరాగం సీరియల్ లో కీలకమైన కథాంశం. తెలుగు ప్రేక్షకులను ఈ సీరియల్ టీవీలకు కట్టి పడేస్తోంది. ఇప్పటి వరకు 370 ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయో తెలియదు. ఈ సీరియల్ రబ్బరు ఎంత దూరమైనా సాగవచ్చు. కానీ తాజాగా ఈ సీరియల్ ఓ కొత్త మలుపు తీసుకుంది.

ఓ మూగ పిల్ల అమ్ములు కోసం ఇద్దరు మిత్రులు పోటీ పడుతుంటారు. భరత్ అనే ఐపిఎస్ అధికారి, అంకిత్ అనే వ్యాపారవేత్త ఇద్దరూ అమ్ములును పెళ్లి చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. భరత్ తో అమ్ములు పెళ్లి పీటల మీద ఆగిపోతుంది. అంకిత్ అమ్ములును ప్రేమిస్తున్నాడని భావించిన భరత్ తానే ఆమెను దక్కించుకోవాలని ఆరాటపడుతుంటాడు. 

మాటల్లేవు, అంతా కళ్లతోనే.. : ఎవరీ మౌనరాగం అమ్ములు?

అంకిత్ కూడా అమ్ములు లేకపోతే బతకలేనంటూ చెబుతుంటాడు. అంకిత్ మీద అమ్ములు తండ్రి సీనియ్యకు మంట. అతని పొడ కూడా గిట్టదు. భరత్ అంటే ఎనలేని ఇష్టం. భరత్ తోనే అమ్ములు పెళ్లి చేయాలని సీనయ్య భీష్మించుకుంటాడు. ఇది భరత్ కు కలిసి వచ్చే విషయమే అయినప్పటికీ అమ్ములు మనసు మాత్రం అంకిత్ మీద ఉంటుంది. 

సీనయ్య కారణంగా తీవ్రంగా గాయపడి బెడ్ కే అతుక్కుపోయిన అంకిత్ అమ్ములు సేవల వల్ల, సాన్నిహిత్యం వల్ల కోలుకుంటాడు. అంకిత్ కుటుంబంలో ఎవరికి కూడా అమ్ములు అంటే ఇష్టం ఉండదు. కానీ, అంకిత్ మాత్రం అమ్ములును కోరుకుంటాడు. తల్లిని నొప్పించకుండా అమ్ములును సొంతం చేసుకోవాలని అంకిత్ చూస్తుంటే, తండ్రి సీనయ్యను కాదనలేక భరత్ తో బాగా ఉన్నట్లు నటిస్తూనే అతన్ని తన దారికి అడ్డం లేకుండా చేసుకోవాలని అమ్ములు ప్రయత్నిస్తూ ఉంటుంది. 

అమ్ములు మనసంతా అంకిత్ మీదనే ఉందని గ్రహించిన భరత్ లో విలన్ నిద్ర లేస్తాడు. అంకిత్ ను చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నాలను తన తెలివితేటలతో అమ్ములు తిప్పికొడుతూ ఉంటుంది. భరత్ నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పినా అంకిత్ నమ్మడు. దాంతో అంకిత్ ను కాపాడుకోవడానికి తగిన ఎత్తులు వేస్తూ అమలు చేస్తూ ఉంటుంది అమ్ములు.

ఇలా సాగుతున్న క్రమంలో అమ్ములు మరో ఎత్తు వేస్తుంది. ఇది బహుశా తిరుగులేని ఎత్తు. పోలీసు వాడినే బోల్తా కొట్టించగల ప్లాన్ అది భరత్ అంటాడు కూడా. భరత్ మీద ఇష్టం పెంచుకున్న స్నేహను విజయవాడ నుంచి అంకిత్ ద్వారా తన ఇంటికి తెప్పిస్తుంది. దాంతో భరత్ కంగు తింటాడు. కార్తీకపౌర్ణమి వేడుకలకు వచ్చిన భరత్ అమ్ములు ఇంట్లోనే ఉంటూ వస్తుంటాడు. స్నేహ భరత్ ను అతుక్కుపోతూ ఉంటుంది. భరత్ చేతిలో స్నేహ చేయి వేసి వాడి చేయి వదలొద్దు అని అంకిత్ చెబుతాడు.

ఈ స్థితిలో భరత్ కంగు తింటాడు. అయినప్పటికీ నిన్ను వదులుకోనంటూ అమ్ములుకు సవాల్ విసురుతాడు. స్నేహ భరత్, అమ్ములు మధ్య ప్రవేశించడం ద్వారా సీరియల్ మరో మలుపు తిరిగిందని చెప్పవచ్చు. ఈ ముగ్గురి మధ్య సన్నివేశాలతో మరిన్ని రోజులు సీరియల్ కొనసాగే అవకాశం ఉంది.