నిన్న హైదరాబాద్ లో జరిగిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు కొరటాల శివకి మెగాస్టార్ చిరంజీవి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ ఈవెంట్ లో చిరంజీవి.. మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. మహేష్ చిత్రనిర్మాతల నుండి ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్ తీసుకోలేదని.. సినిమా పూర్తయిన తరువాత తీసుకుంటానని చెప్పారని.. ఇది మంచి సంప్రదాయమని అన్నారు.

దీని వల్ల నిర్మాతలకు ఎన్నో కోట్ల రూపాయలు వడ్డీల రూపంలో మిగులుతుందని చెప్పారు. గతంలో తాను కూడా ఇలాంటి సంప్రదాయాన్ని అనుసరించినట్లు తెలిపారు. ఇప్పుడు తన కొడుకు రామ్ చరణ్ కూడా సినిమా పూర్తయిన తరువాతే నిర్మాతల నుండి రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలిపారు.

సరిలేరు ప్రీరిలీజ్: నన్ను అన్నేసి మాటలు ఎందుకు తిట్టావ్ విజయశాంతి: చిరంజీవి!

మహేష్ బాబు ముందస్తు అడ్వాన్స్ తీసుకోకపోవడం వలన నిర్మాతలకు సపోర్ట్ గా నిలిచినట్లు అయిందని చెప్పారు. 'మన పరిస్థితి ఏంటి..?' అంటూ తనతో సినిమా  తీస్తున్న కొరటాల శివని ప్రశ్నించానని.. సహజంగా ఆయన ఒక్కో సినిమాకి 130-150 రోజులు తీసుకుంటాడని.. కానీ తనతో 99 రోజుల్లో సినిమా తీస్తానని చెప్పినట్లు చిరు తెలిపారు.

'సర్.. మీరు టైం అంటే టైం కి వచ్చే మనిషి.. కాబట్టి 80 నుండి 99 రోజుల్లో మీతో సినిమా పూర్తి చేస్తాను.. 100 రోజులు తీసుకోను' అని కొరటాల తనతో చెప్పిన మాటలను స్టేజ్ పై గుర్తు చేసుకుంటూ స్టేజ్ పైకి శివని పిలిచారు. దీంతో కొరటాల శివ నవ్వుతూ చిరు దగ్గరకి వచ్చారు.

''పబ్లిక్ లో కమిట్ అవుతున్నా శివ.. 99(రోజులు) మించిందా మర్యాదగా ఉండదు'' అని నవ్వుతూ కొరటాలని దగ్గరకి తీసుకొని మరీ స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారు చిరు.