ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ పేరుతో యువతులతో చాట్ చేస్తూ వారిని మోసం చేసేందుకు ప్రయత్నించిన నిజామాబాద్ జిల్లా, మీర్జాపూర్ వాసి సాయికిరణ్ ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. విజయ్ దేవరకొండ వద్ద పని చేస్తోన్న గోవింద్ అనే యువకుడిని నకిలీ హేమగా మార్చిన పోలీసులు సాయికృష్ణతో చాటింగ్ చేయించారు.

ఈ వలలో పడిన సాయికృష్ణ.. 'ఈ రాత్రికి డేటింగ్ చేద్దాం.. రేపు ఉదయం పెళ్లి చేసుకుందాం' అంటూ హేమకి సమాచారమిచ్చి గురువారం రాత్రి సిటీకి చేరుకున్నాడు. ఎల్బీనగర్ ప్రాంతంలో వలపన్నిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మీర్జాపూర్ కి చెందిన సాయికృష్ణ పదో తరగతి వరకు చదువుకున్నాడు. విజయ్ దేవరకొండకి అమ్మాయిల్లో ఉన్న క్రేజ్ ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేసి తానే విజయ్ దేవరకొండ అంటూ యూట్యూబ్ ఛానెల్ లో తన ఫోన్ నంబర్ ఇచ్చాడు.

విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలకు వల.. రంగంలోకి దిగిన రౌడీ!

సాయి కృష్ణ గొంతు మార్చి విజయ్ దేవరకొండ మాదిరి మాట్లాడడంతో అతడేనని భావించిన అమ్మాయిని చాట్ చేయడం, కాల్స్ మాట్లాడడం మొదలుపెట్టారు. కొన్ని రోజులకు కలుద్దామని వారే అడగడంతో.. ముందుగా తనకు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ తో చాటింగ్ చేయాలని, పూర్వాపరాలు పరిశీలించిన అతడు చేసే సిఫార్సు ఆధారంగా తాను అపాయింట్మెంట్ ఇస్తానంటూ చెప్పే ఈ నకిలీ విజయ్ దేవరకొండ తనకు చెందిన రెండో నంబర్ ఇచ్చేవాడు.

కొందరితో తను విజయ్ దేవరకొండ కజిన్ అంటూ పరిచయం చేసుకున్నాడు. ఈ విషయం విజయ్ దేవరకొండ దృష్టికి వెళ్లడంతో అతడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నకిలీ హేమని రంగంలోకి దింపి సాయికృష్ణని అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం మీర్జాపూర్ లో ఇడ్లీ బండి నిర్వహిస్తోన్న సాయికి తండ్రి లేడు. తల్లి కూడా దివ్యంగురాలు కావడంతో ఆమెకి ఇతడే ఆధారం. సాయిని నిందితుడిగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41-ఏ నోటీసులు జారీ చేసిన పోలీసులు ఆ ఊరి నుండి వచ్చిన పెద్దలకు శుక్రవారం అతడిని అప్పగించారు.