'అర్జున్ రెడ్డి', 'బాహుబలి' లాంటి సినిమాలు మూడేసి గంటల నిడివితో రావడంతో ఆ మధ్య కొందరు దర్శకనిర్మాతలు తమ సినిమాలు కూడా మూడు గంటలు ఉండేలా రిలీజ్ చేశారు. కానీ కొన్ని మిస్ ఫైర్ అవ్వడంతో ఎడిటింగ్ పని మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.

సినిమాల విషయంలో ఎక్కువ లెంగ్త్ ఉండడం ఒక్కోసారి భారంగా మారే ప్రమాదం ఉంది. చాలా సినిమాల విషయాల్లో సినిమా బాగుంది కానీ లెంగ్త్ ఎక్కువైందనే కామెంట్స్ వినిపిస్తాయి. అందుకే ఈ విషయంలో మేకర్స్ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

'నువ్వు డైరెక్టర్ అయితే మనిషిని చంపేస్తావ్'.. హీరోలపై ఛోటా కె నాయుడు కామెంట్స్!

అయితే మహేష్ బాబు నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా మాత్రం మూడు గంటల నిడివితో రూపుదిద్దుకుంటుందని సమాచారం. ఇప్పటివరకు వచ్చిన అవుట్ పుట్, చిత్రీకరించాల్సిన పాటలు ఇవన్నీ కలుపుకుంటే.. ఈ సినిమా మూడు గంటల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

దర్శకుడు అనీల్ రావిపూడికి కామెడీపై మంచి పట్టు ఉంది. సినిమా సెకండ్ హాఫ్ లో కామెడీ సీన్లు బాగా పండాయట. దాని వలన లెంగ్త్ ఎక్కువైందని సమాచారం. ఈ సినిమాని కనీసం పదిహేను నిమిషాల వరకైనా ఎడిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ బాధ్యత నిర్మాత దిల్ రాజు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

దిల్ రాజు జడ్జిమెంట్ పై అటు దర్శకనిర్మాతలకు, ఇటు ప్రేక్షకులకు కాస్త నమ్మకం ఎక్కువ. కథకు అవసరం లేదనుకుంటే.. ఎలాంటి మొహమాటాలు లేకుండా సన్నివేశాలు ఎడిట్ చేస్తుంటారు. సినిమా బాగా ఆడితే ఆ తరువాత సీన్స్ ని యాడ్ చేసి సినిమాకి మరోసారి ఆడియన్స్ ని రప్పించే ప్రయత్నం చేస్తుంటారు.

ఈసారి కూడా అదే ఫాలో అవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలై రికార్డులు సృష్టించింది. రష్మిక, విజయశాంతి, ప్రకాష్ రాజ్ లు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకుతీసుకురానున్నారు.