సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో 'సంక్రాంతికి అల్లుడొస్తాడనుకుంటే మొగుడొచ్చాడు' అనే డైలాగ్ వినిపించింది. దీన్ని మహేష్ ఫ్యాన్స్ బాగా హైలైట్ చేస్తున్నారు.

ఈ సంక్రాంతికి మొగుడొస్తున్నాడంటూ పోస్టర్లు పెడుతున్నారు. దీనికి కౌంటర్ గా బన్నీ ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. సంక్రాంతికి రావాల్సింది మొగుడు కాదు.. మగాడు అంటూ కొత్త పోస్టర్లు పెడుతున్నారు. దీంతో బన్నీ, మహేష్ అభిమానుల మధ్య కొత్త రచ్చ మొదలైంది.

2019లో గెస్ట్ రోల్స్.. సడన్ గా కనిపించి కిక్కిచ్చిన స్టార్స్!

నిజానికి ఈ గొడవ మొదలైంది సోషల్ మీడియాలో కాదు. విశాఖపట్టణంలో ముందుగా మొదలైంది.. ఆ తరువాత మెల్లగా సోషల్ మీడియాకి పాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ అంతా ఒకరినొకరు తిట్టుకునే స్థాయికి చేరిపోయింది. విశాఖలోనే ఓ థియేటర్ ముందు సరిలేరు నీకెవ్వరు సినిమా ఫ్లెక్సీ పెట్టారు.

సంక్రాంతికి మొగుడొస్తున్నాడనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇది పెట్టిన కాసేపటికే ఆ పోస్టర్ ని పీకేసి.. సంక్రాంతికి రావాల్సింది మొగుడు కాదు, మగాడు అంటూ బన్నీ ఫ్లెక్సీ తీసుకొచ్చి పెట్టారు. దీంతో గొడవ కాస్త పెద్దదైంది. ఆ ఫ్లెక్సీలు పెట్టే స్థలం మాదంటే మాదని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కొట్టుకునే వరకు వెళ్లింది. ఆ ఫ్లెక్సీలు సోషల్ మీడియాకి పాకడంతో గొడవ వైరల్ అయింది.

ఈ గొడవ బయటకి వచ్చింది కాబట్టి అందరికీ తెలిసింది. ఇలాంటి గొడవలు మండల స్థాయి నుండి చూసుకుంటే చాలానే ఉంటాయి. ఈ సంక్రాంతికి తమ సినిమానే హిట్ అవుతుందని బన్నీ ఫ్యాన్స్, 'సరిలేరు నీకెవ్వరు' హిట్ అవుతుందని మహేష్ ఫ్యాన్స్ వాదించుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు రిలీజయ్యే వరకు ఈ రచ్చ ఆగేలా లేదు.