Asianet News TeluguAsianet News Telugu

పాత బంగారం: 'లవకుశ' గురించి ఆశ్చర్యపరిచే విశేషాలు

తొలిసారి 26 ప్రింట్లతో విడుదల కాబడి , అన్ని కేంద్రాలలోనూ వంద రోజులుకు పైబడి నడిచి, అది నూట యాభై రోజులు అయినా కలెక్షన్స్ ఎక్కడా డ్రాప్ కాకుండా నిలబడిన రికార్డ్ ఈ సినిమాదే.  

Lava Kusa broke all previous box office records
Author
Hyderabad, First Published Oct 22, 2019, 3:10 PM IST

లలిత శివజ్యోతి ఫిలింస్ పతాకంపై ఎ. శంకర్ రెడ్డి నిర్మాతగా సి.పుల్లయ్య దర్శకత్వంలో లవకుశ చిత్రం (23-03-1963)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగునాట  వసూళ్ల పరంగా కోటి రూపాయల ఖజానాతో తొలిసారి ద్వారాలు తెరిచింది. ఈ చిత్రానికి కలెక్షన్స్ కుంభవృష్టి కురిసింది.  

తొలిసారి 26 ప్రింట్లతో విడుదల కాబడి , అన్ని కేంద్రాలలోనూ వంద రోజులుకు పైబడి నడిచి, అది నూట యాభై రోజులు అయినా కలెక్షన్స్ ఎక్కడా డ్రాప్ కాకుండా నిలబడిన రికార్డ్ ఈ సినిమాదే.  పద్దెనిమిది కేంద్రాలలో రజితోత్సవ వైభవాన్ని పొందింది. 75 వారాలు ప్రదర్శింపబడి  శిఖరాగ్ర స్దాయి విజయాన్ని సాధించింది. ఎ,బి,సి,డి వంటి సెంటర్ల తేడా లేకుండా రాశులు పోసినట్లుగా ధనాన్ని పోగులు చేసింది.

(Also Read) ‘బాహుబలి’ సీక్రెట్స్ రివీల్ చేసిన ప్రభాస్, రాజమౌళి

మారుమూల ప్రాంతాల జనం సైతం ఎడ్లబళ్లుకట్టుకుని , చద్దన్నం మూటలతో థియేటర్స్ కు తరలి వచ్చేవారు. అప్పట్లో అన్ని ఊళ్లకు బస్సు సదుపాయం లేదు,కరెంటూ ఉండేది కాదు.  అయినా ధైర్యం చేసి సినిమా చూసి లవకుశలోని పాటలు, పద్యాలు పాడుకుంటూ ఉత్సాహంగా ఇళ్లకి వెళ్లిపోయేవారు.  ఏ పత్రిక తిరగేసినా లవకుశ గురించిన ఆశ్చర్యకరమైన వార్తలే ఉండేవి.  పత్రికలలో కలెక్షన్స్ ప్రకటించిన తొలి దక్షిణాది చిత్రం ఇది. మూడు వందల అరవై ఐదు రోజులకు గానూ కోటి రూపాయలు వసూలు చేసింది.

Lava Kusa broke all previous box office records

నాటి ఇరవై ఐదు పైసలు, రూపాయి టిక్కెట్లుపై ఈ కలెక్షన్స్ సాధించటం గమనించదగ్గ విశేషం. ఈ నాటి రూపాయి విలువతో పోలిస్తే ఈ చిత్రం కలెక్షన్స్ ఇప్పటికీ రికార్డ్ అనే చెప్పాలి. ఆనాడు మన రాష్ట్ర జనాభా  మూడు కోట్లు అయితే సినిమాను చూసిన జనం 1.98కోట్లు మంది ఆదరించినట్లుగా ఆనాటి పత్రికా ప్రకటనలు చెప్తున్నాయి.  ప్రతీ కేంద్రంలోనూ జనాభా కంటే నాలుగు రెట్లు టిక్కెట్లు అమ్ముడయ్యి  అప్పటికి,ఇప్పటికి కనీవినీ ఎరుగని చరిత్ర సృష్టించింది.

1-1-1964న వరంగల్ రాజరాజేశ్వరీ థియోటర్ వారు విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ఆ ఊరిలో లవకుశ చిత్రాన్ని 4,34,800 మంది చూసారు. అయితే అప్పటి వరంగల్ జనాభా కేవలం  ఒక లక్ష మాత్రమే. ఆ ప్రకారం ఒక్కో ప్రేక్షకుడు ఎన్నెన్ని సార్లు ఈ సినిమాని చూసారో ఊహించుకోవచ్చు. అలాగే ఈ చిత్రం కర్ణాటకలోనూ  ఒకే థియోటర్ లో 35 వారాలు ప్రదర్శింపబడింది.

మళ్లీ 1977, 1980లో ఈ సినిమా రిపీట్ రన్ గా రిలీజ్ అయ్యి శతదినోత్సవాలు జరుపుకుంది. ఇలా మూడు సార్లు ఓ  చిత్రం బెంగుళూరులో శతదినోత్సవం జరుపుకోవటం అనేది కన్నడ సినిమాలకు కూడా సాధ్యం కాలేదు. 

అలా శ్రీరాముడుగా ఎన్టీఆర్ రూపం, అభినయం సమ్మోహనపరిచింది. ఈ సినిమా తమిళ వెర్షన్ 40 వారాలు ఆడగా, హిందీ వెర్షన్ సిల్వర్ జూబ్లీ జరుపుకుంది.ఆయనకు సాటి మరెవ్వరూ లేరని  సర్వ ప్రేక్షక లోకం నిర్ద్వందంగా తీర్మానించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios