తెలుగమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంటూ అక్కడ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే కోలీవుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉండగా.. అక్కడ ఓ దర్శకుడితో వివాదం కారణంగా తన సినిమాలకు కాస్త గ్యాప్ వచ్చింది. దీంతో నటిగా ఆమె గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఆ సమయంలో ఆమెకి అండగా నిలిచాడు ప్రముఖ రచయిత,  నిర్మాత కోన వెంకట్.

అతడు రూపొందించిన 'గీతాంజలి' సినిమాలో అంజలి ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా సక్సెస్ అందుకోవడంతో అంజలికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. కానీ అవకాశాలు మాత్రం రాలేదు. అయితే అంజలి మీద ఉన్న ప్రత్యేక అభిమానం కారణంగా కోన వెంకట్ ఆమెని విడిచిపెట్టలేదు. ఎప్పటికప్పుడు తనను సంబంధించిన సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తూనే ఉన్నాడు.

'నిశ్శబ్దం'గా అనుష్కపై అంజలి కన్ను

తన నిర్మాణంలో వచ్చిన 'శంకరాభరణం'లో కీలకపాత్ర చేయించాడు. అలానే తాను రచించిన 'డిక్టేటర్' సినిమాలో అంజలికి ఒక హీరోయిన్ గా ఛాన్స్ ఇప్పించాడు. ఇలా కోన ఎప్పటికప్పుడు అంజలికి తన సపోర్ట్ అందిస్తూనే ఉన్నాడు. కానీ ఈ మధ్యకాలంలో కోన క్రేజ్ బాగా తగ్గింది. ఆయన్ని రైటర్ గా తీసుకునేవారి సంఖ్యా కూడా తగ్గింది. దీంతో ఆయన అంజలికి ఛాన్స్ లు ఇప్పించలేకపోయాడు.

అంజలితో 'గీతాంజలి' సీక్వెల్ తీయాలనుకునే అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు కోన తన నిర్మాణంలో 'నిశ్శబ్దం' అనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో అనుష్క, మాధవన్ లాంటి తారలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఓ హాలీవుడ్ నటుడు కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇలాంటి సినిమాలో కోన వెంకట్.. అంజలికి ఛాన్స్ ఇవ్వడం విశేషం. తాజాగా ఈ సినిమాలో అంజలి లుక్ ని విడుదల చేశారు. మొత్తానికి అంజలికి తనతో ఉన్న బంధాన్ని కోన బాగానే కంటిన్యూ చేస్తున్నారు.