Asianet News TeluguAsianet News Telugu

బోరు బావిలో చిన్నారి.. సూపర్ స్టార్ తీవ్ర ఆవేదన!

మూసివేయకుండా ఉంచుతున్న బోరుబావులు చిన్నారుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. దేశంలో ఏదో ఒక చోట చిన్నారులు బోరుబావుల్లో ప్రమాదవశాత్తూ పడుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మనప్పారై అనే గ్రామంలో రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడ్డాడు. 

kid fall into borewell Rajinikanth pray for two year old boy safety
Author
Hyderabad, First Published Oct 27, 2019, 3:38 PM IST

తిరుచ్చి జిల్లాలోని మనప్పారైలో బోరుబావిలో పడ్డ చిన్నారిని రక్షించేందుకు గత 24 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దీపావళి సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన బోరు బావిలో పడ్డ చిన్నారి గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

బోరుబావిలో చిక్కుకున్న చిన్నారి సుజీత్ క్షేమంగా బయటకు రావాలి. ఈ మేరకు అంతా భగవంతుడిని ప్రార్థించాలి. యంత్రాల సహాయంతో చిన్నారిని బయట తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో చిన్నారికి ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని రజనీకాంత్ సూచించారు. 

శుక్రవారం రోజు సుజీత్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు. మొదట చిన్నారి 35 అడుగుల లోతులో ఉన్నట్లు గమనించారు. తాజాగా సుజీత్ వంద అడుగుల లోతు వరకు జారిపోయినట్లు తెలుస్తోంది. ఐఐటి మద్రాసు నిపుణులు సహా 6 బృందాలు చిన్నారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

బోరు బావిలోనే రెండేళ్ల సుజిత్:కొనసాగుతున్న సహాయక చర్యలు

చిన్నారిని క్షేమంగా బయటకు తీసేందుకు అధికారులు, సహాయ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఇప్పటికే మూడు సార్లు విఫలమయ్యాయి. తమిళనాడు మంత్రి విజయభాస్కర్ సహాయక కార్యక్రమాలని పర్యవేక్షిస్తున్నారు. 

బోరుబావికి సమాంతరంగా ఓ గొయ్యిని తవ్వుతున్నారు. కానీ పెద్ద పెద్ద రాళ్లు వస్తుండడంతో గొయ్యిని తవ్వే పని ఆలస్యం అవుతోంది. అగ్నిమాపక సిబ్బందితో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్ ఎల్ సి సిబ్బంది చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి విజయభాస్కర్ ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios