నిర్భయ దోషులను క్షమించాలని కోరిన ప్రముఖ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. గురువారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది.

ఇందులో భాగంగా నిర్భయ తల్లికి ఇందిరా జైసింగ్ చేసిన అభ్యర్ధనపై మీ స్పందనేంటని.. కంగనాని ప్రశ్నించగా ఆమె ఘాటు సమాధానమిచ్చింది. ఇందిరా జైసింగ్ లాంటి మహిళలను దోషులతో పాటు నాలుగు రోజు జైళ్లో ఉంచాలని.. కచ్చితంగా వారితో కలిసి ఉండేలా చేయాలని.. అప్పుడే ఆమెకి ఆ బాధ తెలుస్తుందని అన్నారు.

స్టార్ హీరోకి అదిరిపోయే కౌంటర్.. 'మహాభారతం' ఏమిటని ప్రశ్నించిన కంగన!

ఇలాంటి వాళ్లకు దోషులు, హంతకులపై ప్రేమ, దయ, జాలి పుట్టుకువస్తున్నాయి.. వీళ్లే మృగాళ్లకు, హంతకులకు జన్మనిస్తారు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఏడేళ్ల క్రితం దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులను ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు ఉరి తీయడానికి రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ తన భర్త, దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ దోషులను క్షమించినట్లుగానే.. నిర్భయ తల్లి కూడా నలుగురు దోషులను క్షమించాలని ఇందిరా జైసింగ్‌ ట్విటర్‌ వేదికగా కోరారు. ఈ విషయంపై స్పందించిన నిర్భయ తల్లి.. ఇందిరా లాంటి వారి వల్లే బాధితులకు న్యాయం జరగడం లేదని అసహనం వ్యక్తం చేశారు.