నేనిప్పుడు బీజేపీలో ఉన్నాను.. ‘వ్యూహం’ సినిమాపై జీవిత రాజశేఖర్ ఏమన్నారంటే?
వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా తిరస్కరించడంతో రివైజింగ్ కమిటీకి పంపినట్టు నిర్మాత దాసరి కిరణ్ వెల్లడించారు. అయితే.. ఆ రివైజింగ్ కమిటీలో వైసీపికి చెందిన జీవిత రాజశేఖర్ ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. తనకు వైసీపీతో సంబంధం లేదని, తాను ఇప్పుడు బీజేపీలో ఉన్నానని స్పష్టం చేశారు.

హైదరాబాద్: రాంగోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాకు సెన్సార్ కష్టాలు మొదలయ్యాయి. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా సెన్సార్ బోర్డు తిరస్కరించింది. సినిమాలో నిజ జీవితంలోని నేతల పేర్లనే పెట్టారని, అలాగే, వర్తమాన కాలానికి సబంధించిన ఘట్టాలు అందులో ఉన్నాయని పేర్కొంది. అయితే, సెన్సార్ బోర్డు అభ్యంతరాలపై రివైజింగ్ కమిటీకి దరఖాస్తు చేసినట్టు వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ వెల్లడించారు.
వ్యూహం సినిమా ఏపీ సీఎం జగన్‌కు సానుకూలంగా ఉందని, ఆయనను కీర్తిస్తూ ఉన్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ వర్గాల నుంచీ వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ఇదిలా ఉండగా, ఈ ఎపిసోడ్‌లోకి అనూహ్యంగా ప్రముఖ నటుడు రాజశేఖర్ సతీమణి జీవిత పేరు తెర మీదికి వచ్చింది.
రివైజింగ్ కమిటీలో జీవిత రాజశేఖర్ సభ్యురాలని, ఆమె వైసీపీ నేత కాబట్టి వ్యూహం సినిమాకు అనుకూలంగా వ్యవహరిస్తారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ సినిమా నిర్మాత ఈ మేరకు కేంద్ర సెన్సార్ బోర్డుకు ఓ లేఖ కూడా రాశారనే వార్తలు వచ్చాయి.
ఈ సందర్బంలోనే జీవిత రాజశేఖర్ స్పందించారు. తాను ఇప్పుడు బీజేపీలో ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం మీడియాలో సర్క్యులేట్ అవుతున్నట్టు వైసీపీ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు, వైసీపీ కండువాలతో, జగన్‌తో ఉన్న ఫొటోలు కూడా చాలా కాలం క్రితం నాటివని వివరించారు. ఇక పోతే వ్యూహం సినిమాపైనా, రివైజింగ్ కమిటీ గురించీ ఆమె స్పందించారు.
Also Read : ఆర్జీవీకి సెన్సార్ బోర్డ్ షాక్.. ‘‘వ్యూహం’’కు సర్టిఫికెట్ ఇచ్చేది లేదన్న సీబీఎఫ్‌సీ
వ్యూహం సినిమా రివైజింగ్ కమిటీకి వచ్చినప్పుడు అన్ని సినిమాలు చూసినట్టుగానే చూస్తానని జీవిత రాజశేఖర్ తెలిపారు. తన దృష్టిలో పక్షపాతం ఉండబోదని వివరించారు. ఇంకా తనకు ఆఫీసు నుంచి ఎలాంటి సమాచారమూ రాలేదనీ వివరించారు. అసలు ఇప్పుడు తన గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు.