పార్క్ హయత్ హోటల్ లో 'మా' డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్, కృష్ణంరాజు, మోహన్ బాబు, సుబ్బిరామిరెడ్డి వంటి ప్రముఖులు హాజరయ్యారు. డైరీ ఆవిష్కరణ అనంతరం మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఆయన 'మా' అసోసియేషన్ అభివృద్ధికి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. చిరు మాటలను తప్పుగా అర్ధం చేసుకున్న రాజశేఖర్ అతడితో గొడవకి దిగారు. ఇండస్ట్రీలో నిప్పు రాజుకుంటుందని.. కప్పి పడితే నిప్పు దాగదని రాజశేఖర్ వ్యాఖ్యలు చేస్తూ స్టేజ్ దిగి వెళ్లిపోయారు. అతడి ప్రవర్తనతో అందరూ షాక్ అయ్యారు.

చిరు, మోహన్ బాబు కాళ్లు మొక్కి.. స్టేజ్ దిగివెళ్లిపోయిన రాజశేఖర్

దీంతో రాజశేఖర్ తరఫున పరిస్థితి సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది జీవిత. చిరంజీవి గారు 'మా'కు ఎంతో సమయం కేటాయించారని.. మా అభివృద్ధికి ఎన్నో సలహాలు ఇచ్చారని.. వారి నుండి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. ప్రతీ చోటా విభేదాలు అనేవి ఉంటాయని.. మనుషులు అన్నాక ఇలాంటి ఇష్యూలు వస్తూనే ఉంటాయని అన్నారు.

రాజశేఖర్ ది చిన్నపిల్లాడి మనస్తత్వమని.. ఆయన మనసులో ఏముంటే అది మాట్లాడేస్తారని.. ఆయన కారణంగా కలిగిన మనస్పర్దని తొలగించే ప్రయత్నం చేశారు.   చిరంజీవిని ఉద్దేశిస్తూ 'మాకు మీద గొరవం ఎప్పటికీపోదు' అని చెప్పారు.

'మా'ని అభివృద్ధి పరచడమే మా కలని చెప్పారు. ప్రస్తుతం 'మా'లో ఎవరికి ఎవరితో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. రాజశేఖర్ గారు ఎమోషనల్ అయ్యారని.. అందరం కలిసే పని చేస్తామని.. మీరు ముందు నడిపించండి.. మేం అన్నీ సాధిస్తామని పెద్దలను ఉద్దేశించి చెప్పారు.