చాలా రోజులుగా హీరో వెంకటేష్ తమిళ సినిమా 'అసురన్' రీమేక్ లో నటిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. నిర్మాత సురేష్ బాబు ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకొని తన వద్ద పెట్టుకున్నారు. సరైన దర్శకుడి కోసం వెతుకులాట మొదలుపెట్టారు.

'అసురన్' కోలీవుడ్ లో సక్సెస్ అందుకోవడంతో తెలుగు రీమేక్ పై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ముందుగా ఈ చిత్ర దర్శకుడిగా హను రాఘవపూడి పేరు వినిపించింది. హను తన వెర్షన్ కూడా రాస్తున్నాడని అన్నారు.

ఈ దర్శకులకు కొండంత ధైర్యం వీళ్లే.. ఆ పేరు పడితే బ్లాక్ బస్టర్ అంతే!

ఆ తరువాత అజయ్ భూపతి పేరు కూడా వినిపించింది. అయితే ఇప్పుడుతెరపైకి అనూహ్యంగా శ్రీకాంత్ అడ్డాల పేరు వచ్చింది. నిర్మాత సురేష్ బాబు స్వయంగా శ్రీకాంత్ అడ్డాల పేరు చెప్పడం విశేషం. ఇటీవల కొందరు మీడియా సభ్యులతో ముచ్చటించిన సురేష్ బాబు 'అసురన్' రీమేక్ కోసం శ్రీకాంత్ అడ్డాలని ఎంపిక చేసినట్లు చెప్పారు.

మరికొద్ది రోజుల్లో ఈ విషయంపై అధికార ప్రకటన రానుందని చెప్పారు. 'అసురన్' రీమేక్ శ్రీకాంత్ అడ్డాల చేస్తున్నాడని తెలియగానే చాలా మంది షాక్ అవుతున్నారు. మూడేళ్లుగా శ్రీకాంత్ అడ్డాల ఎలాంటి సినిమా చేయలేదు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'కొత్త బంగారు లోకం' వంటి సెన్సిబుల్ సినిమాలు తీసిన శ్రీకాంత్ అడ్డాల 'బ్రహ్మోత్సవం' ఫ్లాప్ తో ఛాన్స్ లు లేక అలా ఉండిపోయాడు.

ఇప్పుడు వెంకీ హీరోగా 'అసురన్' రీమేక్ తీయడానికి సిద్ధమవుతున్నాడు. అసురన్ ఓ భిన్నమైన సినిమా. మానవ సంబంధాలు, భావోద్వేగాలు కూడా వుంటాయి. బహుశా ఈ అంశం నచ్చే శ్రీకాంత్ అడ్డాల కూడా ఓ అడుగు ముందుకేసి ఉంటాడని చెబుతున్నారు. ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా రూపొందించనున్నారు.