దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో అద్భుత చిత్రం ఆర్ఆర్ఆర్. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అతిపెద్ద మల్టీస్టారర్ మూవీగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఆర్ఆర్ఆర్ చిత్రం జులై 30న ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం, భారీ స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఉండడంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేసారు. కనీసం సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అయినా ఇవ్వాలని సోషల్ మీడియాలో  ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. 

ఇద్దరు బడా హీరోలు రాజమౌళి దర్శత్వంలో కలసి నటిస్తుంటే అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ చిత్ర టైటిల్ ఆర్ఆర్ఆర్ అని రాజమౌళి చాలారోజుల క్రితమే ప్రకటించారు. కానీ దానికి ఫుల్ ఫామ్ ని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. గతంలో రామ రావణ రాజ్యం అంటూ పలు టైటిల్స్ వినిపించాయి. 

తాజాగా ఆర్ఆర్ఆర్ టైటిల్ గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి 'రఘుపతి రాఘవ రాజారామ్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వినగానే దేశభక్తిని పెంపొందించే టైటిల్ ఇది. మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం ఉద్యమ సమయంలో ఈ పాటని బాగా పాపులర్ చేశారు. సర్వమత సమ్మేళణంలా, దేశభక్తిని నింపే ఈ పాట ఇప్పటికీ ఏదోఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. 

జయసుధ కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్.. చిరంజీవి, పవన్, రాజమౌళి సందడి(ఫొటోస్)

ఈ సాంగ్ దేశం మొత్తం పాపులర్. కాబట్టి ఈ పాటలోని లైన్ 'రఘుపతి రాఘవ రాజారామ్' నార్త్ ఆడియన్స్ కి కూడా బాగా చేరువవుతుందని రాజమౌళి భావిస్తున్నారు. త్వరలోనే ఈ టైటిల్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మార్చి నుంచి ఆర్ఆర్ఆర్ అప్డేట్స్ అందిస్తామని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో అభిమానులకు ప్రకటించింది. 

డివివి దానయ్య దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రాంచరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ కి జోడిగా ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం.