కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఇండియన్ 2' సెట్స్ లో ఘోరప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే మరణించారు. పలువురు గాయాలపాలయ్యారు. దర్శకుడు శంకర్ స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది. శంకర్ వ్యక్తిగత సహాయకుడు, అసిస్టెంట్ డైరెక్టర్, ఫుడ్ సప్లయిర్ ఇలా ముగ్గురు సిబ్బంది మరణించారు.

ఈ ఘటనపై సుమోటోగా కేసు పెట్టిన పోలీసులు, ఐపీసీలోని 4 సెక్షన్లు జోడించారు. విచారణకు రావాలని శంకర్, కమలహాసన్, క్రేన్ ఆపరేటర్ లతో పాటు క్రేన్ యజమాని, ప్రొడక్షన్ మేనేజర్ లకు నోటీసులు పంపించారు.గత వారం దర్శకుడు శంకర్ పోలీసులు ముందు హాజరు కాగా.. తాజాగా నటుడు కమల్ హాసన్ ని చెన్నై పోలీసుల ముందు హాజరయ్యారు.

'ఇండియన్ 2' యాక్సిడెంట్: పోలీసుల ఎదుట హాజరైన కమల్

చిత్రం కోసం భారీసెట్‌ను వేయాలని ఆదేశించింది ఎవరు..? ముందు జాగ్రత్తగా రక్షణ చర్యలు ఎందుకు చేపట్టలేదు..? పరిశ్రమల్లో వినియోగించే భారీ క్రేన్‌ను అనుమతి లేకుండా ఎందుకు తెచ్చారు..? ప్రమాదం జరిగినపుడు మీరు ఎక్కడున్నారు..? ప్రమాదాన్ని మీరు ప్రత్యక్షంగా చూశారా..? ఆ సమయంలో తీసుకున్న చర్యలు ఏమిటి..? వంటి ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఈ ప్రశ్నలకు కమల్‌ ఇచ్చిన సమాధానాన్ని వీడియో ద్వారా వాంగ్మూలంగా నమోదు చేశారు.

విచారణ ముగించుకొని బయటకి వచ్చిన కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు తనను పిలిపించారని.. ప్రమాదం సమయంలో ఎలాంటి గాయాలకు గురికాకుండా బయటపడినవారిలో తను కూడా ఒకడినని.. అందుకే ప్రమాదం గురించి తెలిసిన విషయాలు చెప్పడం నా ధర్మం అంటూ చెప్పుకొచ్చారు. ఇకపై ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా పోలీసు సూచనలతో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.