అర్జున్ సురవరం హిట్ తర్వాత నిఖిల్ వేగం పెంచుతున్నాడు. వరుస చిత్రాలకు సైన్ చేస్తున్నాడు. తాజాగా నిఖిల్ తదుపరి చిత్రానికి సంబంధించిన ఆసక్తికర ప్రకటన వచ్చింది. హీరో నిఖిల్ తన తదుపరి చిత్రం కోసం డైరెక్టర్ సుకుమార్ తో చేతులు కలిపాడు. ఈ చిత్రంలో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా భాగం కాబోతున్నారు. 

సుకుమార్ యువ దర్శకులని ప్రోత్సహించడం చూస్తూనే ఉన్నాం. నిఖిల్ తదుపరి చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. కుమారి 21ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మేరకు చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. 

ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ సంస్థలో అల్లు అరవింద్ గారితో, సుకుమార్ గారితో కలసి వర్క్ చేయనుండడం సంతోషంగా ఉందని నిఖిల్ తెలిపాడు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు నిఖిల్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే సుకుమార్ కుమారి 21ఎఫ్, వైష్ణవ్ తేజ్ ఉప్పెన లాంటి చిత్రాలకు కథలు అందించి యువ దర్శకులని ప్రోత్సహిస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న నిఖిల్ చిత్రం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుందనడంలో సందేహం లేదు. 

ఇటీవలే నిఖిల్ నటించిన అర్జున్ సురవరం చిత్రం విడుదలై విజయాన్ని అందుకుంది. అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే రాణిస్తోంది. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటించాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

'అర్జున్ సురవరం' 3 రోజుల కలెక్షన్స్.. నిఖిల్ కు బిగ్ రిలీఫ్!

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లోని చిత్రంతో పాటు నిఖిల్ కార్తికేయ సీక్వెల్ లో కూడా నటించాల్సి ఉంది. యువ హీరోగా నిఖిల్ తనకంటూ టాలీవుడ్ లో ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు.