ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ పై హీరో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరో మహేష్ బాబుతో ఫోటో దిగడానికి రమ్మని పిలిచి తమని తీవ్రంగా అవమానించారని మండిపడుతున్నారు. స్టార్ హీరోకి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయలేదని అన్నారు.

మహేష్ బాబుతో ఫోటో దిగాలనుకుంటే గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీకి రావాలని నిర్వాహకులు ఆన్లైన్ లో ప్రచారం చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో తోపులాట జరిగి పలువురు అభిమానులు గాయపడ్డారు.

'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ లో ప్రమాదం.. మహేష్ ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్లే!

ఇద్దరికి కాళ్లు విరిగినట్లు తెలుస్తోంది. బౌన్సర్లు దురుసుగా వ్యవహరించారని.. తమపై చేయి చేసుకున్నారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. తమను ఎందుకు కొట్టారో అర్ధం కావడం లేదని వాపోయారు. అభిమానులను కొట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.

ట్రైన్ లో సీట్లు దొరకకపోయినా రాత్రంతా ప్రయాణం చేసి ముప్పై మందితో కలిసి వచ్చామని.. ఇక్కడకి వచ్చిన తరువాత తమను కొట్టి తరిమేశారని ఒక అభిమాని వాపోయాడు. కార్యక్రమం రసాభాసగా మారడంతో బ్యారికేడ్లు విరిగిపోయాయి.

కోపంతో అభిమానులు కుర్చీలు విరగ్గొట్టారు. అయితే అనుమతి తీసుకొని ఉంటే భద్రతా ఏర్పాట్లు చేసేవాళ్లమని పోలీసులు చెబుతున్నారు. అనుమతి తీసుకోకుండా కార్యక్రమం చేపట్టిన నిరవహకులపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.