బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫైనల్ కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3షో గత మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తూ వస్తోంది. ఆదివారం జరగబోయే ఫైనల్ ఎపిసోడ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. 

Bigg Boss3: బిగ్ బాస్ విన్నర్ పై పుకార్లు.. నమ్మొద్దంటున్న నాగార్జున!

అభిమానులకు కావలసినన్ని సర్ ప్రైజ్ లతో బిగ్ బాస్ 3 ఫైనల్ సిద్ధం అవుతోంది. చివరి రోజున ప్రేక్షకులని వినోదంలో ముంచెత్తేందుకు నాగార్జున రెడీ అవుతున్నాడు. బిగ్ బాస్ విజేత ఎవరనే  ఉత్కంఠ కొనసాగిస్తూనే ఆటపాటలతో అలరించనున్నారు. ఎలిమినేటి అయిన కంటెస్టెంట్స్ వేదికపై నృత్య ప్రదర్శన చేయనున్నారు. 

కేవలం ఇవి మాత్రమే కాదు.. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు బిగ్ బాస్ షో లో సందడి చేయనున్నారు. తాజాగా స్టార్ మా సంస్థ ఫైనల్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేసింది. ఈ ప్రోమోతో ఫైనల్ ఎపిసోడ్ లో సందడి చేయబోయే అతిథుల విషయంలో క్లారిటీ వచ్చింది. 

హీరోయిన్ కేథరిన్, నిధి అగర్వాల్ డాన్స్ పెర్ఫామెన్స్ తో బిగ్ బాస్ వేదికని హీటెక్కించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో సూపర్ హిట్ అయిన దిమాఖ్ ఖరాబ్ పాటకు నిధి డాన్స్ చేయనుంది. సీనియర్ హీరో శ్రీకాంత్, దర్శకుడు మారుతి, హీరోయిన్ అంజలి బిగ్ బాస్ ఫైనల్ కు అతిథులుగా హాజరు కానున్నారు. 

క్రేజీ హీరోయిన్ రాశి ఖన్నా బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యులతో కలసి సందడి చేయనుంది. మారుతి, అంజలి, శ్రీకాంత్ లకు నాగార్జున ఒక్కో పని అప్పజెప్పనున్నారు. ప్రోమోలో చూపించిన దానిప్రకారం.. ప్రస్తుతం హౌస్ ఉన్న వారిని ఎలిమినేట్ చేసే భాద్యతని మారుతి, అంజలికి అప్పగించారు. మావల్ల కాదు బాబోయ్ అంటున్న నాగార్జునకు అంజలి, మారుతి మొరపెట్టుకుంటున్న దృశ్యం సరదాగా ఉంది. 

ఇక బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ ఇంటి సభ్యులు కూడా హాజరవుతున్నారు. నాగార్జున, వరుణ్ సందేశ్ బామ్మ మధ్య సరదా సంభాషణ ఆకట్టుకుంటోంది. వరుణ్ సందేశ్ బామ్మ నాగార్జునతో మాట్లాడుతూ.. నేను మా మనవడి కోసం కంటే మీ కోసమే బిగ్ బాస్ షోకు వచ్చినట్లు ఆమె తెలిపింది. మనం చిత్రంలో శ్రీయకు 'ఐ లవ్యూ' అని చెప్పే సన్నివేశం తనకు చాలా ఇష్టమని ఆమె అన్నారు. 

దీనితో 'ఐ లవ్యూ' రాజ్యలక్ష్మి గారు అని నాగ్ బదులిచ్చాడు. మొత్తంగా ఫైనల్ ఎపిసోడ్ ని కావలసింత మసాలా ఎలిమెంట్స్ తో సిద్ధం చేసి ఉంచారు.