ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు(80) గురువారం రోజు మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న గొల్లపూడి చెన్నైలోని ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గొల్లపూడి ఎన్నో చిత్రాల్లో విలక్షణమైన నటనతో ఆకట్టుకున్నారు. 

అన్నపూర్ణ, సుబ్బారావు దంపతులకు 1939 ఏప్రిల్ 14న మారుతీ రావు జన్మించారు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, పత్రికా సంపాదకుడిగా ఖ్యాతిని గడించారు. 1982లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం ద్వారా గొల్లపూడి నటుడిగా సినీ రంగప్రవేశం చేశారు. 

గొల్లపూడి నటనా శైలిని గమనించిన దర్శకులు ప్రతి చిత్రంలో ఆయన కోసం ప్రత్యేకంగా కొన్ని ఊతపదాలని డైలాగుల్లో ఉపయోగించేవారు. గొల్లపూడి చెప్పే డైలాగులు గమ్మత్తుగా ఉండేవి. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంలో 'అధర్వణ శాస్త్రం' అంటూ గొల్లపూడి చెప్పే డైలాగులని మరిచిపోలేం. 

Gollapudi Maruti Rao: రూ.100 బహుమతి గొల్లపూడి జీవితాన్నే మలుపుతిప్పింది

గొల్లపూడి తన కెరీర్ లో దాదాపు 290 చిత్రాల్లో నటించారు. వాటిలో యముడికి మొగుడు, సంసారం ఒక చదరంగం, పల్లెటూరి మొనగాడు, అభిలాష, గూఢచారి నెం 1, ఆదిత్య 369 లాంటి అద్భుత చిత్రాల్లో నటించారు. 

డబ్బు చాలా వచ్చేది కానీ.. ఆర్థిక పరిస్థితిపై గొల్లపూడి ఏమన్నారంటే?

గొల్లపూడి తన కెరీర్ లో 6 నంది అవార్డుల్ని సొంతం చేసుకున్నారు. 1965లో ఆత్మ గౌరవం చిత్రానికి గాను ఉత్తమ రచయితగా నంది అవార్డు అందుకున్నారు. ఉత్తమ కమెడియన్ గా 1983లో తరంగిణి చిత్రానికి గొల్లపూడికి నంది అవార్డు లభించింది. 1985లో రామాయలయంలో భాగవతం చిత్రానికి, 1991లో మేస్త్రి కాపురం చిత్రానికి నంది అవార్డులు గెలుచుకున్నారు. 1994లో ప్రేమ పుస్తకం చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా మరో  నంది అవార్డు సొంతం చేసుకున్నారు. 1996లో బుల్లితెర నటుడిగా కూడా గొల్లపూడి నంది అవార్డు సొంతం చేసుకోవడం విశేషం. 

మారుతీ రావు ఇటీవల కాలంలో రానా దగ్గుబాటి లీడర్, దరువు, సుకుమారుడు, జోడి లాంటి చిత్రాల్లో నటించారు. గొల్లపూడి దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం ప్రేమ పుస్తకం.