ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ పేరుతో మోసం జరిగినట్లు కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు అందింది. నటుడు రాఘవ లారెన్స్ మక్కల్ సేవా నర్పని మండ్రం ప్రధాన కార్యదర్శి శంకర్ ఈ విషయాన్ని తెలిపారు.

నగర కమిషనర్ కార్యాలయంలో ఆయన అందించిన ఫిర్యాదులోని వివరాలు లారెన్స్ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా.. ఆయన పేరుతో ప్రసారమాధ్యమాల్లో నకిలీ ఐడీని గుర్తుతెలియని వ్యక్తులు రూపొందించారని చెప్పారు.

స్టార్ హీరోల మొదటి సినిమా.. రిజెక్ట్ చేసిన దర్శకులు!

బెంగళూరు, సేలం, ఊటీ, రామనాథపురం, వడపళని, కొళత్తూరు తదితర ప్రాంతాల్లో రాఘవ లారెన్స్ పేరుతో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారని.. ఇల్లు నిర్మించే పేరుతో మోసానికి పాల్పడుతున్నారనిచెప్పారు. నకిలీ ఐడీ ద్వారా తప్పుడు ప్రచారాలు పోస్ట్ అవుతున్నాయని అన్నారు.

రాఘవ లారెన్స్ పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా పోస్ట్ చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో కోరారు. దీనిపై తగిన చర్యలు చేపట్టనున్నట్లు నగర కమిషనర్ హామీ ఇచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'కాంచన' సిరీస్ లో భాగంగా నాల్గవ సినిమాని విడుదల చేశారు.

ప్రస్తుతం బాలీవుడ్ లో 'కాంచన' రీమేక్ ని డైరెక్ట్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాకి 'లక్ష్మీ బాంబ్' అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.