ఇండియా అద్భుతమైన నటుడుని నేడు కోల్పోయింది. బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్(54) కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. గత రెండేళ్లుగా ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఇర్ఫాన్ ఖాన్ విదేశాల్లో చికిత్స తీసుకుని కోలుకున్నట్లే కనిపించాడు. కానీ ఇటీవల అతడి ఆరోగ్యం తిరిగి విషమించింది.

దీంతో అతన్ని ముంబైలోని కోకిలబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఐసియులో చికిత్స పొందుతుండగా ఇర్ఫాన్ మృతి చెందారు. 

కోలన్ ఇన్ ఫెక్షన్ కారణంగా ఇర్ఫాన్ ఖాన్ ను కోకిలబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలోని ఐసియులో చేర్చిన విషయం వాస్తవమేనని ఆయన అధికార ప్రతినిధి  ఇటీవల చెప్పారు.

తనకున్న శక్తి, ధైర్యం కారణంగా ఇప్పటి వరకు పోరాటం చేస్తూ వచ్చారని, ఆయన కోలుకోగలరనే నమ్మకం ఉందని కుటుంబ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ ఆయన వ్యాధితో పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. 2018లో ఇర్ఫాన్ ఖాన్ కు న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ ఉన్నట్లు తేలింది. చికిత్స కొసం తాను లండన్ వెళ్లినట్లు కూడా తెలిపారు.

ఏడాది పాటు వేరే దేశంలో ఉన్న ఇర్ఫాన్ ఖాన్ నిరుడు ముంబైకి తిరిగి వచ్చారు. అంగ్రేజీ మీడియం సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. అ సినిమా ఈ ఏడాది విడుదలైంది. చికిత్స కోసం మరోసారి విదేశాలకు వెళ్లాల్సి రావడంతో ఆ సినిమా ప్రమోషన్ చేయలేకపోయారు.

కొద్ది రోజుల క్రితమే ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయిదా బేగం జైపూర్ లో మరణించారు. ఆమె వయస్సు 95 ఏళ్లు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతుండడం వల్ల ఆమె అంత్యక్రియలకు ఆయన వెళ్లలేకపోయారు. తల్లి మరణించిన కొద్దిరోజుల్లోనే కొడుకు మరణించండంతో తీవ్ర విషాదంగా మారింది. 

ఇర్ఫాన్ ఖాన్ అంటే పాత్రలో పరకాయ ప్రవేశం చేసే నటుడు. ఎలాంటి పాత్ర అయినా సరే అవలోకగా పోషించి మెప్పించే వారు. ఇర్ఫాన్ ఖాన్ తన కెరీర్ లో హిందీ తో పాటు పలు భాషల్లో నటించారు. ఇర్ఫాన్ ఖాన్ తెలుగులో మహేష్ బాబు నటించిన సైనికుడు చిత్రంలో మెరిశారు. 

సలాం బాంబే!, మక్బూల్ (2004), పాన్ సింగ్ తోమర్ (2011), ది లంచ్‌బాక్స్ (2013), హైదర్ (2014), గుండే (2014), పికు (2015) , తల్వార్ (2015) ,హిందీ మీడియం (2017) లాంటి ప్రముఖ చిత్రాల్లో ఇర్ఫాన్ ఖాన్ నటించారు. ఇర్ఫాన్ ఖాన్ ప్రతిభకు ఎన్నో అవార్డులు దక్కాయి.