స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో...' . వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా జనవరి 6న చిత్రయూనిట్ భారీగా మ్యూజిక్ కన్సర్ట్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ మొత్తం హాజరైంది.

బన్నీ కుదురుగా నిలబడితే పాట రాస్తానని చెప్పా.. సిరివెన్నెల

ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ''తన వయసు నుండి దిగి సిరివెన్నెల, తన స్థాయి నుండి ఎక్కి తమన్ ఇద్దరూ కలిసి ఒక కామన్ పాయింట్ దగ్గర కలిసి ఈ సినిమాకి స్థాయిని తీసుకొచ్చారు.. ఇది వినాలనిపించే సాయంత్రం.. అనాలనిపించే సాయంత్రం కాదు.. ఒక పాట మనకి ఊతం.. దాని చేయి పట్టుకొని నడవొచ్చు.. అది మన స్నేహితురాలు.. మన కష్టాలను తనతో చెప్పుకోవచ్చు.. తను మన ప్రేయసి.. దాని ఒళ్లో తల పెట్టుకొని ప్రేమని పొందొచ్చు.. మన గురువు.. మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకి జ్ఞానం భోదిస్తుంది. మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. అలాంటి సంగీతాన్ని గౌరవించుకోవాలని.. ఈ మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశాం. ఈ ఐడియా అల్లు అర్జున్ ది. పాటలను అధ్బుతంగా పాడిన సింగర్స్ అందరికీ ధన్యవాదాలు. వేటూరి గారి తరువాత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మాకు ఎంతో గౌరవం తీసుకొచ్చారు. ఈ సినిమాకి మొదలు, చివర రెండూ కూడా అల్లు అర్జునే.. కాకినాడలో కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో పాటల లిరిక్ వీడియోలు రొటీన్ గా ఉంటున్నాయండీ.. పాటకి పని చేసిన ప్రతీ ఒక్కరూ కనిపించేలా ఉంటే బాగుంటుందని చెబితే.. అందులో భాగంగా వచ్చిందే 'సామజవరగమనా'' అని చెప్పారు.

ఇక తన సినిమాలో మొదటిసారి పని చేసిన అల్లు అయాన్ ని సూపర్ స్టార్ అని సంభోదించారు త్రివిక్రమ్. అల్లు అర్హ మోస్ట్ ఇంటెలిజెంట్, బ్రిలియంట్ యాక్టర్ అని అన్నారు. వారిద్దరూ మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.