దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న సినిమా అంటే క్రేజ్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోద్ది. అలాంటిది..పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే వేరే చెప్పాలా..పస్ట్ లుక్ రాగానే సోషల్ మీడియాలో మొత్తం పేట్రేగిపోయింది. ఓ రేంజిలో రచ్చ రచ్చ చేసి వదిలింది. దాంతో దిల్ రాజు ఖచ్చితంగా ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకుంటాడు. తప్పేమీలేదు. క్రేజ్ లేని ప్రాజెక్టుని ఎలాగూ ముందుకు తోయలేం. క్రేజ్ ఉన్న సినిమాని అయినా కాస్తంత లాభాలకు అమ్ముకోక పోతే ఎలా....అయితే కాస్తంత లాభం అయితే ఎవరికీ ఏ ఇబ్బందీ లేదు. కానీ బోలెడంత లాభానికి ఈ సినిమాని అమ్మాలని రేట్లు ఫిక్స్ చేసారట దిల్ రాజు. ఇది డిస్ట్రిబ్యూటర్స్ ని కంగారు పెడుతోందని ట్రేడ్ టాక్.

అయితే కొంతమంది బయ్యర్లు మాత్రం ఇది సరైన రేటే, ఈ క్రేజ్ కు ఆ మాత్రం పెట్టాల్సిందే. ఓపెనింగ్స్ అదిరిపోయాయి అని అంచనా వేసి కొనటానికి ముందుకు వస్తున్నారట. అయితే కాస్త ఆచి,తూచి ముందు కెళ్లే వాళ్లు మాత్రం పింక్ ఒరిజనల్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు కదా..వాటిని పవన్ సినిమాలో ఎలా పెడతారు. అంతా కోర్ట్ రూమ్ డ్రామా అంటే చూస్తారా...వంటి డౌట్స్ తో సతమతమవుతున్నారట. అంతంత రేట్లు పెట్టి సినిమాని కొంటే ఆ తర్వాత తేడా కొడితే కష్టం కదా అని బేరం మొదలెడుతున్నారట. అయితే బేరం పెట్టేవాళ్లను ప్రక్కన పెట్టి...ఇంట్రస్ట్ ఉన్న ఉత్సాహవంతులతో దిల్ రాజు ముందుకు వెళ్తున్నారట. ఆయన ఈ ప్రాజెక్టుతో ఈ మధ్యన చిన్న సినిమాలతో వచ్చిన లాస్ లు మొత్తం రికవరీ చేయాలని భావిస్తున్నారట.

వకీల్ సాబ్ లో యంగ్ హీరోయిన్ ఎమోషనల్ క్యారెక్టర్!
 
ఇక వకీల్ సాబ్ చిత్రం ఫస్ట్ లుక్ ట్విట్టర్ లో సునామీ సృష్టిస్తోంది. పవన్ కల్యాణ్ సుదీర్ఘ విరామం తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా హైప్ చుక్కలను అంటుతోంది. ట్విట్టర్ లో వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ కు లభిస్తున్న స్పందనే అందుకు నిదర్శనంగా ఫ్యాన్స్ చూపెడుతున్నారు. కేవలం 24 గంటల వ్యవధిలో 3.5 మిలియన్ల టైటిల్ ట్యాగ్ లతో వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ రికార్డు సృష్టించింది. దేశంలో ఇప్పటివరకు మరే ఫస్ట్ లుక్ ఈ ఘనత సాధించలేదు. అంతేకాదు, టాలీవుడ్ లో అత్యధికంగా 25.3 వేల సార్లు రీట్వీట్ చేసిన ఫస్ట్ లుక్ కూడా ఇదే కావటం విశేషం.

పాలిటిక్స్ లోకి వెళ్లిన  కారణంగా పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' తర్వాత మరో చిత్రంలో నటించలేదు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీలో హిట్టయిన పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ లాయర్ పాత్ర పోషిస్తున్నారు. దీనికి వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత కాగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు.