డైరెక్టర్ శంకర్ కు ఇటీవల టైం బాగాలేదు. గతంలో లాగా శంకర్ క్రియేటివిటీ పనిచేయకపోగా వరుసదెబ్బలు ఎదురవుతున్నాయి. శంకర్ 2010లో తెరకెక్కించిన రోబో చిత్రం తర్వాత అతడికి సరైన సక్సెస్ లేదు. ఆ తర్వాత వచ్చిన స్నేహితుడు, ఐ, 2.0 చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. 

2.0 చిత్రం విషయంలో అయితే శంకర్ అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ లో శంకర్ ఆ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించాలని భావించారు. బడ్జెట్ సరిపోకపోవడం, రిలీజ్ కష్టాలు లాంటి సమస్యలు శంకర్ ని వెంటాడాయి. చివరకు నాసిరకం అవుట్ ఫుట్ తోనే ఆ చిత్రాన్ని రిలీజ్ చేశారు. 

ఆ తర్వాత శంకర్ ఇండియన్ 2 చిత్రాన్ని ప్రారంభించారు. దాదాపు పాతికేళ్ల క్రితం శంకర్ వీరిద్దరి కాంబోలో వచ్చిన ఇండియన్ చిత్రం సంచలన విజయం సాధించింది. దీనితో శంకర్ ఆ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేశారు. ఇండియన్ 2 చిత్రం ప్రారంభించినప్పటి నుంచి సమస్యలే ఎదురయ్యాయి. ఓ దశలో ఈ చిత్రం ఆగిపోయిందని కూడా ప్రచారం జరిగింది. 

ఎలాగోలా ప్రారంభమై షూటింగ్ జరుగుతోందిలే అని ఫ్యాన్స్ సంతోషపడుతున్న టైంలో చిత్ర యూనిట్ కు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. చెన్నైలోని పూనమల్లి లో షూటింగ్ జరుగుతుండగా క్రేన్ విరిగి పడి అక్కడికక్కడే ముగ్గురు సిబ్బంది మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఈ ఘోర సంఘటనతో ప్రస్తుతం సినిమానే ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డట్లు తమిళ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. 

నాసిరకం క్రేన్స్ ఉపయోగించడం, సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో పోలీసులు ఈ కేసుపై విచారణ ప్రారంభించారు. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ తో పాటు దర్శకుడు శంకర్, కమల్ హాసన్ లని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ లైకా సంస్థకు వ్యతిరేకంగా పోలీసులకు సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్ లో కరోనా.. హీరో అక్కినేని అఖిల్ కామెంట్స్

జరిగిన ఘటనకు పూర్తి భాద్యత నిర్మాణ సంస్థదే అన్నట్లుగా కమల్ మాట్లాడుతున్నారట. దీనితో కమల్ హాసన్, లైకా మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనితో ఇండియన్ 2 చిత్రంపైనే ప్రస్తుతం నీలి నీడలు కమ్ముకున్నాయని తమిళ వర్గాలు అంటున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితిని దర్శకుడు శంకర్ ఎలా హ్యాండిల్ చేస్తారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.