నటుడు సునీల్ మరోసారి కమెడియన్ గా రీఎంట్రీ ఇస్తున్నాడని తెలియగానే జనాలకు అంచనాలు పెరిగిపోయాయి. పైగా దర్శకుడు త్రివిక్రమ్ సినిమాల్లో సునీల్ కనిపిస్తున్నాడనే వార్తలు వచ్చినప్పుడు.. వీరి కాంబినేషన్ లో అదిరిపోయే కామెడీ ట్రాక్స్ ఉంటాయని ఆశించారు.

సునీల్ కూడా అలానే అనుకున్నాడు కానీ.. అది జరగడం లేదు. 'అరవింద సమేత'లో సునీల్ ని పెట్టాడు. కానీ అతడితో కామెడీ చేయించలేక.. అలా అని హీరోని ఎలివేట్ చేయించేలా మాట్లాడించాలో అర్ధం కాక త్రివిక్రమ్ సతమతమయ్యాడు. అలానే సినిమా పూర్తయింది.

పవన్ ఫ్యాన్స్ ని మరోసారి కెలికేసిన అల్లు అర్జున్!

కనీసం 'అల.. వైకుంఠపురములో' సినిమాలో అయినా సునీల్ పరిస్థితి మెరుగవుతుందా..? అంటే అది కూడా లేదనే అనిపిస్తుంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తోన్న 'అల.. వైకుంఠపురములో' సినిమా ట్రైలర్ ని తాజాగా విడుదల చేశారు. ఇందులో కూడా సునీల్ ఉన్నాడు. కానీ ఎక్కడ ఉన్నాడా..? అని వెతుక్కోవాల్సిన పరిస్థితి కలిగింది.

చివరికి సునీల్ పక్కన ఉండే హర్షవర్ధన్ కి కూడా డైలాగ్ ఉంది కానీ సునీల్ కి డైలాగ్ లేదు. 'అరవింద సమేత' మాదిరి ఇది కాన్సెప్ట్ ఫిల్మ్ కాదు కాబట్టి సునీల్ కామెడీ ట్రాక్ అదిరిపోతుందని ఆడియన్స్ భావించారు. ట్రైలర్ లో కనీసం ఒక్క డైలాగ్ అయినా ఉంటుందని అనుకున్నారు. కానీ అలా జరగడం లేదు. ట్రైలర్ ని బట్టి చూస్తుంటే నలుగురిలో ఒకటిగా సునీల్ పాత్ర వెళ్లిపోతుందని అనిపిస్తుంది. కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చిన సునీల్ కి ఇంకెప్పుడు బ్రేక్ వస్తుందో చూడాలి!