దర్శకుడు ఓంకార్ రూపొందించిన 'రాజు గారి గది 3' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి చాలా వరకు నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. తాజాగా ఏర్పాటు చేసిన సినిమా ప్రెస్ మీట్ లో కమెడియన్ అలీ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా థియేటర్ కి వెళ్లి చాలా రోజులైందని.. ఈ సినిమా కూకట్ పల్లిలో బ్రహ్మరాంబ థియేటర్ కి వెళ్లి చూశానని చెప్పారు.

సినిమా చూస్తే అక్కడే చూడాలనుకున్నానని.. ఎందుకంటే ఆడియన్స్ డబ్బులు పెట్టుకొని సినిమా చూస్తారు..  మనస్పూర్తిగా నవ్వుకుంటారని అన్నారు. కానీ ప్రివ్యూ షో చూస్తుంటే.. మన సొమ్ము అవతలివాడు లాగేసుకుంటున్నాడేమోనని అనుకుంటారో ఏమో అసలు నవ్వరు.. నవ్వు వచ్చినా నవ్వరు.. అందుకోసమే.. ఇకపై నేను ప్రివ్యూ షోలు చూడడం  మానేస్తున్నా.. అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. 

కళామతల్లికి చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా తన బిడ్డలుగానే చూస్తుందని అన్నారు. కొందరు పనిగట్టుకొని సినిమా బాలేదని ప్రచారం చేస్తున్నారని.. అసలు మీరెవరు చెప్పడానికి కౌన్ కిస్కా గొట్టంగాళ్లు.. అంటూ మండిపడ్డారు.

‘రాజుగారి గది 3’ రివ్యూ!

''సినిమా ఎలా ఉందో చెప్పాల్సింది ప్రేక్షక దేవుళ్లు.. వాళ్లను నమ్ముకొని మేం బ్రతుకుతున్నాం.. ఎవరైతే కామెంట్ చేస్తున్నారో.. వాళ్లని నమ్ముకొని మేం ఇండస్ట్రీలోకి రాలేదు. అలా సినిమా మీద ఒక రాయి వేసేస్తే.. మేం తోపులం అనుకుంటారు.. కానీ మీ అంత మూర్ఖులు ఎవరూ ఉండరని నేను అనుకుంటున్నా..'' అంటూ క్రిటిక్స్ పై ధ్వజమెత్తారు. 

దర్శకుడు ఓంకార్, అశ్విన్ లకు ఈ కామెంట్స్ ని పెద్దగా పట్టించుకోవద్దని సలహా ఇచ్చారు. తను కూడా ఇలాంటి పరిస్థితులను చాలానే ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ఈ సినిమాలో అలీ కూడా ఓ ముఖ్య పాత్ర పోషించారు. ఫస్ట్ వీకెండ్ కి ఈ సినిమా మూడు కోట్లకు పైగా షేర్ రాబట్టింది. లాంగ్ రన్ లో ఈ సినిమా లాభాలను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.