వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న తాజా చిత్రం 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు'. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది.

చంద్రబాబు, వైఎస్ జగన్, నారా లోకేష్ ఇలా ప్రముఖ రాజకీయనాయకులను టార్గెట్ చేస్తూ ట్రైలర్ ఉంది. అయితే ఇప్పుడు సినిమా టైటిల్, కథపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అనంతపురం టూటౌన్ పోలీసులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగరాజు ఫిర్యాదు చేశారు.

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'.. బాలయ్యకి స్పెషల్ ట్రీట్మెంట్..?

'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమా టైటిల్ ని నిషేధించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కులాల మధ్య గొడవలు సృష్టిస్తూ సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా సినిమా టైటిల్ ఉందని అన్నారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులను ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకుంటారని.. కులాల పేర కాదని లేఖలో తెలిపారు. రామ్ గోపాల్ వర్మపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.

వర్మకి ఇలాంటి కేసులు కొత్తేమీ కాదు. గతంలో తను రూపొందించిన చాలా సినిమాలకు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు వర్మ. అయినప్పటికీ  రాజీ పడకుండా వివాదాస్పద కథలను ఎన్నుకుంటూ తన ప్రత్యేకత చాటుతున్నాడు. ఇప్పుడు ఏపీ సమకాలీన రాజకీయాలను టార్గెట్ చేస్తూ ఈ తరహా సినిమాను తెరకెక్కించాడు. 24 గంటల్లో యూట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ కి మూడు మిలియన్ల వ్యూస్ వచ్చాయి.