టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'RRR'. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమాపై అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు పడాల వీరభద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా పేరుతో చరిత్రను వక్రీకరించడం  దర్శకుడు రాజమౌళికి తగదని వీరభద్రరావు అన్నారు.

అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్టణంలో జిల్లాలోని పాండ్రంకిలో పుట్టి కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో 1924 మే 7న బ్రిటీష్ సైనికులు జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందారని చెప్పారు. ఇక కొమరం భీమ్ 1901లో జన్మించి 1941లో మరణించారని చరిత్ర చెబుతోందని వీరభద్రరావు వివరించారు. వీరిద్దరికీ స్నేహం ఎలా ఏర్పడిందో చరిత్రలో ఎక్కడా లేదని.. చరిత్రలో లేని విషయాలతో చరిత్రను వక్రీకరించడం తగదని ఆయన అన్నారు.

'RRR' టార్గెట్ దసరా..? రాజమౌళి చెప్పిన టైమ్ డౌటే..!

చరిత్రను వక్రీకరించకుండా చర్యలు తీసుకోవాలంటూ నర్సీపట్నం ఆర్డీవోకు వీరభద్రరావు వినతి పత్రం ఇచ్చారు. నర్సీపట్నంతో అల్లూరికి వీడదీయలేని అనుబంధం ఉందని, భవిష్యత్తులో అల్లూరి జిల్లా ఏర్పాటు చేస్తే నర్సీపట్నం కేంద్రంగానే ఏర్పాటు చేయాలని వీరభద్రరావు డిమాండ్ చేశారు. అయితే రాజమౌళి సినిమాను మొదలుపెట్టే సమయంలోనే ప్రెస్ మీట్ పెట్టి కథ విషయంలో క్లారిటీ ఇచ్చారు.

 

చరిత్రలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ఎక్కడా కలుసుకోలేదని, వారిద్దరూ కలుసుకొని ఉంటే ఏం జరిగి ఉంటుందనే ఊహతో కథ రాసుకున్నట్లు రాజమౌళి చెప్పారు.   సినిమాలో రామ్‌చరణ్‌ సరసన అలియాభట్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్‌ ఇందులో కొమరం భీమ్‌గా, రామ్‌చరణ్.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.అజయ్‌ దేవగణ్‌ ముఖ్య భూమిక పోషిస్తున్నారు.

డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు బాహుబలి చిత్రానికి పనిచేసిన టీం ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం కష్టపడుతోంది.. బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30న చిత్రాన్ని విడుదల చేస్తారు.