ఈ కాలంలో ఓ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ అనుకున్న ప్రకారం జరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి కాస్త సమయం పడుతుంది. అలాంటిది దర్శకుడు రాజమౌళి సినిమాలంటే ఆలస్యమవ్వడమనేది మామూలు విషయం. 'బాహుబలి' రెండు భాగాలుగా తెరకెక్కించడానికి ఇదేళ్లకు పైగా టైం తీసుకున్నాడు. పెర్ఫెక్ట్ లేనిదే ఏ ఒక్క ఫ్రేమ్ ని ఓకే చేయడు. వర్క్ 
విషయంలో అసలు రాజీ పడడు.

అందుకే అంతంత సమయం తీసుకుంటూ ఉంటాడు. 'బాహుబలి' సినిమా రిలీజ్ డేట్ విషయంలో చాలా మార్పులు చేశాడు. ఇప్పుడు 'RRR' విషయంలో కూడా అదే చేయబోతున్నాడని సమాచారం. తను రూపొందిస్తున్న 'RRR' సినిమాకి సంబంధించి మొదటి ప్రెస్ మీట్ పెట్టినప్పుడే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు రాజమౌళి. 2020 జూలై 30న సినిమాను విడుదల చేస్తామని చెప్పారు.

 

కానీ జనాలకు నమ్మకం కలగలేదు. అందుకే మీడియా వాళ్లు అప్పుడే 'ఈ డేట్ కి పక్కగా రిలీజ్ ఉంటుందా..? లేక ఎప్పటిలానే వాయిదా వేస్తారా..?' అని మొహమాటం లేకుండా అడిగేశారు. దానికి రాజమౌళి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిన టైంకి వస్తామని చెప్పారు. ఆ సమయంలో రాజమౌళి చాలా ధీమాగానే ఉన్నారు. ఆ తరువాత 'RRR' సినిమా షూటింగ్ సాగిన తీరు, ప్రస్తుతం షూటింగ్ స్టేటస్ ని బట్టి చూస్తుంటే సినిమా చెప్పిన సమయానికి రావడం అసాధ్యం అంటున్నారు.

సినిమాలో హీరోలుగా నటిస్తోన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ గాయాలపాలవ్వడంతో కొన్ని రోజులు షూటింగ్ వాయిదా పడింది. మధ్యలో 'సైరా' సినిమా ప్రమోషన్స్ కోసం చరణ్ మరికొంత సమయం తీసుకున్నాడు. మరికొన్ని కారణాల వలన కూడా షూటింగ్ క్యాన్సిల్ అయింది. ఈ కారణాల వలన మొత్తంగా మూడు నెలల సమయం వృధా అయిందని.. ఈ క్రమంలో సినిమా రిలీజ్ వాయిదా వేయక తప్పదని చిత్రవర్గాలు చెబుతున్నట్లు సమాచారం.

 

కాబట్టి వచ్చే ఏడాది దసరాకి సినిమాను రిలీజ్ చేసే లక్ష్యంగా కొత్త ప్లానింగ్ చేస్తున్నారని టాక్. దేశవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేయడానికి దసరా సెలవులు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. మరి ఆ టైంకి ఏ సినిమాలు రిలీజ్ పెట్టుకున్నా వాయిదా వేసుకోక తప్పదు. ఎందుకంటే 'బాహుబలి' సినిమా తరువాత రాజమౌళి తీస్తున్న సినిమా.. పైగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలు. ఈ కాంబోలో సినిమా అంటే మామూలు విషయం కాదు. రిస్క్ తీసుకొని ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా రిలీజ్ చేసినా.. 'RRR' సునామీలో కొట్టుకుపోవడం ఖాయం!