సినీ ఆర్టిస్ట్ కళ్యాణి ఆత్మహత్యపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆదివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోంగార్డుగా పని చేస్తోన్న ఆమె భర్త ప్రసాద్.. కళ్యాణిని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని మృతురాలి తల్లి సూరినేనమ్మ ఆరోపించింది. ఈ మేరకు తెలంగాణా సినీ, ఆర్టిస్ట్ యూనియన్ నాయకులతో కలిసి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా, భీమడోలు మండలం, కుల్లా గ్రామానికి చెందిన కళ్యాణి మొదటి భర్తతో విడాకులు తీసుకొని కుమార్తెతో సహా నగరానికి వలస వచ్చింది. ఈవెంట్లు నిర్వహిస్తూ సినిమాల్లో నటిస్తోంది. ఈ నేపధ్యంలో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో హోంగార్డుగా పని చేస్తున్న ప్రసాద్ తో ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది. ఇది ఇలా ఉండగా.. ఈ నెల 10న కళ్యాణి బలకంపేట లింగయ్యనగర్ లోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

'అల.. వైకుంఠపురములో' ఫస్ట్ డే కలెక్షన్లు!

ఆమె ఆత్మహత్యకి పాల్పడినట్లు మృతిరాలి భర్త ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ఆర్టీఓ సమక్షంలో పంచనామా నిర్వహించారు. శనివారం రాత్రి ఈఎస్‌ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా అక్కడికి వచ్చిన సినీ మూవీ, ఆర్టిస్ట్‌ యూనియన్‌ నాయకులు కళ్యాణి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళకు దిగారు.

మృతురాలి ఒంటిపై గాయాలున్నాయని.. ఆమె భర్తే కళ్యాణికి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని  ఆరోపించారు. ఆదివారం ఉదయం నగరానికి చేరుకున్న కళ్యాణి తల్లి సూరినేనమ్మ కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్తికోసం ప్రసాద్‌ కళ్యాణిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  పోస్టుమార్టం రిపోర్టు వస్తే మృతికి గల కారణాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు.