హైదరాబాద్: నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సినీ నిర్మాత సి. కల్యాణ్ మరోసారి స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి నివాసంలో మరోసారి సినీ ప్రముఖులు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి నిర్మాత భరద్వాజ కూడా వచ్చారు. చిరంజీవి, నాగార్జున లీడ్ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారని, అందుకే వారు సమావేశానికి వచ్చారని కల్యాణ్ చెప్పారు. 

బాలకృష్ణ రియల్ ఎస్టేట్ అని ఎందుకున్నారో తెలియదని ఆయన అన్నారు. దర్శకులు, నిర్మాతలు మాట్లాడుకునే సమావేశాలు మాత్రమేనని, కేసీఆర్ చెప్పడంతో నాగార్జున, చిరంజీవి సమావేశాలకు వచ్చారని వారన్నారు. అవసరమైనప్పుడు బాలకృష్ణను పిలుస్తామని ఆయన చెప్పారు. 

Also Read: కేసీఆర్‌తో సినీ చర్చలపై బాలకృష్ణ అసంతృప్తి: చిరంజీవి వ్యూహం ఇదే!

బాలకృష్ణ వ్యాఖ్యలపై తమ్మారెడ్డి భరద్వాజ కూడా స్పందించారు. మమ్మల్ని పిలువలేదనే వ్యాఖ్యల్లో అర్థం లేదని ఆయన అన్నారు. ఇంతకు ముందు సమావేశాలకు తనను కూడా పిలువలేనది ఆయన అన్నారు. రన్నింగ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మాత్రమే మాట్లాడుకున్నారని ఆయన చెప్పారు. బాలయ్య లేకుండా ఇండస్ట్రీ ఉందని అనుకోవడం లేదని ఆయన అన్నారు. 

మహేష్, వెంకటేష్ ... ఇలా చాలా మందిని పిలువ లేదని ఆయన చెప్పారు. అవసరమైనప్పుడు కల్యాణ్ అందరినీ పిలుస్తారని ఆయన చెప్పారు. బాలయ్య, నాగబాబు వ్యాఖ్యలు వాళ్ల వ్యక్తిగతమని ఆయన అన్నారు. 

Also Read: ఇండస్ట్రీకి కింగ్‌వి కాదు.. హీరోవే, మూసుకుని కూర్చోలేం: బాలయ్యకు నాగబాబు వార్నింగ్

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు సినిమాల షూటింగులు, విడుదలలు కూడా ఆగిపోయాయి. ఈ స్థితిలో తిరిగి సినిమా షూటింగులు జరుపుకోవడానికి వెసులుబాట్లు కల్పించాలని కోరుతూ సినీ ప్రముఖులు కొందరు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ చర్చలు జరిపారు. ఈ ప్రతినిధుల్లో చిరంజీవి, నాగార్జున కూడా ఉన్నారు. అయితే, బాలకృష్ణ, ఇతర హీరోలు చాలా మంది ఇందులో లేరు. 

దానిపై బాలకృష్ణ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఆ సమావేశాలు జరిపారని ఆయన వ్యాఖ్యానించారు. తనను పిలువకపోవడంపై ఆయన తీవ్రమైన ఆసంతృప్తిని వ్యక్తం చేశారు. బాలయ్య వ్యాఖ్యలపై ఇంతకు ముందు సి. కల్యాణ్ స్పందించారు. ఈ సమావేశాలు కేవలం నిర్మాతలు, దర్శకులకు సంబంధించినవేనని చెప్పడానికి వారు ప్రయత్నిస్తున్నారు. హీరోలను ఎవరినీ పిలువలేదని చెబుతున్నారు. చిరంజీవి, నాగార్జున ప్రత్యేక పరిస్థితుల్లో సమావేశాలకు వచ్చారని అంటున్నారు. చిరంజీవి చొరవ తీసుకుని ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారనే ఆలోచనతో బాలయ్య తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది.