సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద వార్ మొదలుకానుంది. ఇప్పటికే 'దర్బార్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇది డబ్బింగ్ సినిమా కావడం, ఇదివరకటిలా రజినీకాంత్ కి ఇక్కడ క్రేజ్ లేకపోవడంతో పెద్దగా సందడి కనిపించడం లేదు. కానీ సినిమా పాజిటివ్ టాక్ అయితే వచ్చింది.

ఇది ఇలా ఉండగా.. మహేష్ బాబు సినిమా 'సరిలేరు నీకెవ్వరు' రిలీజ్ కాబోయే శనివారం నాడు అసలు హంగామా మొదలుకానుంది. ఆ సినిమా రిలీజైన మరుసటి రోజే మరో భారీ సినిమా 'అల.. వైకుంఠపురములో' రాబోతుంది. ఈ రెండు సినిమాలకు ఆన్ లైన్ బుకింగ్స్ ఇప్పటికే మొదలైపోయాయి.

పూజా హెగ్డేపై మండిపడుతున్న నమ్రత.. డబ్బే కారణమా..?

ఈ రెండు సినిమాలపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రేక్షకులు ఈ సినిమాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆన్లైన్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే మాత్రం మహేష్ సినిమాదే పైచేయిగా కనిపిస్తోంది.

బన్నీ సినిమా కంటే ఒకరోజు ముందు వస్తుండడం, పైగా పక్కా మాస్ ఎంటర్టైనర్ లా కనిపిస్తుండడంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఈ సినిమాకే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టికెట్లు పెట్టిన వెంటనే బుక్ మై షో, పేటీఎం లాంటి యాప్స్ లో వెంటవెంటనే అమ్ముడిపోతున్నాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా టికెట్లు బాగా సేల్ అవుతున్నాయి.

'అల.. వైకుంఠపురములో'కి కూడా బుకింగ్స్ జోరు బాగానే ఉంది. కానీ 'సరిలేరు నీకెవ్వరు'తో పోలిస్తే టికెట్లు నెమ్మదిగా అమ్ముడవుతున్నాయి. 'అల ..' కి ఇంకా మల్టీప్లెక్స్ లో బుకింగ్స్ మొదలుకాలేదు. అవి ఓపెన్ అయ్యాక పరిస్థితి మారుతుందనిపిస్తుంది. ఈ రెండు సినిమాలతో కలిసి వస్తోన్న'ఎంతమంచి వాడవురా' సినిమాకి ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు.