బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో బీహార్ పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే ముంబై పోలీసుల నుంచి వారికి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదు.

అలాగే బీహార్ నుంచి దర్యాప్తులో పాల్గొనేందుకు వచ్చిన పట్నా ఎస్పీ వినయ్ తీవారిని క్వారంటైన్ నుంచి విడుదల చేయాల్సిందిగా పాట్నా రేంజ్ ఐజీ సంజయ్ సింగ్ చేసిన విజ్ఞప్తిని బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) తిరస్కరించింది.

Also Read:సీబీఐకి సుశాంత్‌ కేసు.. వారందరిలో గుబులు..?

బీఎంసీ ఆదేశాల ప్రకారం.. వినయ్ 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. బీఎంసీ నిర్ణయంపై బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే సైతం తన అసంతృప్తిని తెలియజేశారు. సుశాంత్ మరణంపై తమకు అనుమానాలున్నాయని పేర్కొంటూ ఆయన తండ్రి కేకే సింగ్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఆయన ఫిర్యాదు ఆధారంగా సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసిన పాట్నా పోలీసులు.. నలుగురు సభ్యులు గల ప్రత్యేక బృందాన్ని ముంబైకి తెలిపింది. అలాగే దర్యాప్తు మరింత ముమ్మరంగా సాగేందుకు గాను ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ తివారీ కూడా ఆగస్టు 3న ముంబై కి చేరుకున్నారు.

అయితే కరోనా నిబంధనల ప్రకారం.. బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. దీని ప్రకారం వినయ్‌ని సైతం బీఎంసీ అధికారులు నిర్బంధ క్వారంటైన్‌లో ఉంచారు.

సుశాంత్ కేసు దర్యాప్తులో ఆటంకాలు ఎదురవుతున్నందున వినయ్ తివారీని క్వారంటైన్ నుంచి విడుదల చేయాలని పాట్నా ఐజీ సంజయ్ సింగ్... బీఎంసీ కమీషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్‌కు రాసిన లేఖలో కోరారు.

Also Read:సుశాంత్ డెత్ మిష్టరీ.. ఆ హక్కువారికి ఉంది..అనుపమ్ ఖేర్

సరిగ్గా ఇదే సమయంలో సుశాంత్ మరణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ సిఫారసును కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో చనిపోయాడు.

అప్పటి నుంచి ముంబై పోలీసులే ఈ కేసును విచారిస్తున్నారు. అయితే నటుడి ప్రియురాలు, రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో బీహార్ పోలీసులు సైతం సమాంతర దర్యాప్తు చేపట్టారు.