హైదరాబాద్: తనపై సినీ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలపై మాట్లాడడానికి నందమూరి హీరో, టీడీపీ ఎమ్మల్యే బాలకృష్ణ నిరాకరించారు. కేసీఆర్ తో తెలుగు సినీ ప్రముఖులు జరిపిన చర్చలపై బాలకృష్ణ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భూములు పంచుకుంటున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో దుమారం రేపాయి. 

ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు బాలకృష్ణపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఇండస్ట్రీకి, తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని నాగబాబు డిమాండ్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. 

Also Read: ఇండస్ట్రీకి కింగ్‌వి కాదు.. హీరోవే, మూసుకుని కూర్చోలేం: బాలయ్యకు నాగబాబు వార్నింగ్

మొత్తం వివాదంపై బాలకృష్ణ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. నాగబాబుకు, మీకు గొడవ జరిగింది కదా అని యాంకర్ అడిగితే తనకేమీ జరగలేదని, అతని మాట్లాడుతున్నాడని బాలకృష్ణ అన్నారు. తానెందుకు మాట్లాడుతానని ప్రశ్నించారు. నాగబాబు చేసిన వ్యాఖ్యలపై మీరేమైనా మాట్లాడుతారా అని అడిగితే "నేనేందుకు మాట్లాడుతాను.. అసలు మాట్లాడను. ఛీఛీ నేను మాట్లాడమేమిటి? ఇండస్ట్రీ అంతా ఇవాళ... ఆల్మోస్ట్ మనకు సపోర్టింగ్ గా వస్తున్నప్పుడు ఇంక నేనేం మాట్లాడాలి" అని బాలకృష్ణ అన్నారు. 

భూముల గురించి చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా బాలకృష్ణ మాట్లాడకుండా మౌనం వహించారు. చిరంజీవి నివాసంలో జరిగిన సమావేశాలకు, కేసీఆర్ తో జరిగిన చర్చలకు తనను ఎందుకు పిలువలేదో తనకు తెలియదని బాలకృష్ణ అన్నారు. గతంలో కేసీఆర్ పై మీరు కొన్ని విమర్శలు చేశారు. అందుకే పిలువలేదా అని యాంకర్ ప్రశ్నిస్తే ఆ విషయం తనకు చెప్పవచ్చు కదా... కేసీఆర్ కు తన మీద ఏ విధమైన కోపం లేదని బాలకృష్ణ అన్నారు. 

Also Read: పిచ్చికుక్కలు: నాగబాబు సంచలన ట్వీట్, ఎవరిని ఉద్దేశించి...

అయినా రాజకీయాలు వేరు అని ఆయన అన్నారు. ఇప్పుడు నామా నాగేశ్వర రావును పార్టీలో చేర్చుకోలేదా, అయన ఎన్ని తిట్లు తిట్టాడో తెలుసు కదా అని, రాజకీయాలు వేరని ఆయన అన్నారు. అందుకే హిపోక్రసీ, సైకోఫాన్సీ అని తాను అంటున్నట్లు ఆయన తెలిపారు. తనకు వేరేగా చూస్తే తనకు తిక్క రేగుతుందని బాలకృష్ణ అన్నారు. కేసీఆర్ కు అటువంటివి ఏమీ లేవని ఆయన అన్నారు.